
పేదల అభ్యున్నతికి పాటుపడాలి
కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి
గుంటూరు వెస్ట్: సమాజంలో అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం ఆర్థికంగా వృద్ధి చెందిన వారు ముందుకు వచ్చి వారిని దత్తత తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి కోరారు. స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో పారిశ్రామికవేత్తలు, వ్యాపార సంస్థల ప్రతినిధులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలను అభివృద్ధి చేసేందుకు పీ–4 పథకాన్ని ప్రవేశపెట్టిందన తెలిపారు. ఇందులో భాగంగా మార్చి నుంచి నిర్వహించిన సర్వేలో ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో 1.20 లక్షల బంగారు కుటుంబాలను గుర్తించినట్లు పేర్కొన్నారు. గ్రామ సభల ద్వారా వారిని స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పెద్దలతో చర్చించి అర్హత ఉన్నవారందరినీ జాబితాలో చేర్చామని తెలిపారు. సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్నవారు వ్యక్తిగతంగా, సంస్థల పరంగా బంగారు కుటుంబాలను దత్తతకు తీసుకుని సహకారం అందించాలని ఆమె కోరారు. బంగారు కుటుంబాల్లోని పిల్లల విద్యా అవసరాలు, చిరు వ్యాపారులను ప్రోత్సహించడానికి మెంటార్‌గా, ఇతర అంశాల్లోనూ మార్గదర్శులు సహాయం అందించాలని తెలిపారు. ప్రభుత్వ విజన్– 2047 స్వర్ణాంధ్ర సాధన దిశగా అడుగులు వేయాలంటే పీ–4 కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కలెక్టర్ కోరారు. కార్యక్రమంలో సీపీఓ శేషశ్రీ , ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శివకుమార్, జిల్లా పరిశ్రమల శాఖ జీఎం జయలక్ష్మి, అధికారులు పాల్గొన్నారు.