తెనాలి రూరల్: రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరు ఆర్ అండ్ బీ శాఖలో ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తున్న జాన్‌బాబు(50) మంగళవారం ఉదయం స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు దాటుతుండగా రైలు ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనాస్థలికి చేరుకొని కన్నీరుమున్నీరయ్యారు.
జాన్‌బాబు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఘటనాస్థలిని రైల్వే పోలీసులు పరిశీలించి మృతదేహాన్ని స్థానిక జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు జీఆర్పీ ఎస్‌ఐ జి. వెంకటాద్రిబాబు తెలిపారు.