
రేవులో పడి వ్యక్తి మృతి
నిజాంపట్నం: వేటకు వెళ్తూ ప్రమాదవశాత్తు రేవులో పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన ఇది. అడవులదీవి ఎస్‌ఐ బాబూరావు వివరాల మేరకు కొత్తపాలెం పంచాయతీ శారదానగర్‌కు చెందిన బాలకోటయ్య (23) సముద్రంలో వేటకు వెళ్ళేందుకు సోమవారం రేవులో పడవపై వెళ్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి రేవులో పడ్డాడన్నారు. గల్లంతైన బాలకోటయ్య మృతదేహాన్ని మంగళవారం రేవు ఒడ్డున గుర్తించామన్నారు. మృతుని సోదరుడు బాల శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
షార్ట్ సర్క్యూట్‌తో టైలర్ షాపు దగ్ధం
మేదరమెట్ల: విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా కొరిశపాడు మండలం తిమ్మనపాలెం గ్రోత్ సెంటర్ సమీపంలోగల టైలర్ దుకాణం సోమవారం అర్ధరాత్రి మంటల్లో కాలిపోయింది. బాధితులు తెలిపిన సమాచారం మేరకు.. సోమవారం రాత్రి దుకాణం తలుపులు వేసి ఇంటికి వెళ్లారు. అర్ధరాత్రి సమయంలో స్థానికులు ఫోన్ చేసి షాపులో మంటలు వస్తున్నాయని చెప్పటంతో అక్కడకు వచ్చే సరికి దుకాణం పూర్తిగా కాలిపోయింది. దుకాణంలో ఉన్న బట్టలు, సామాగ్రి దగ్ధమయ్యాయని.. వాటి విలువ రూ.2లక్షల వరకు ఉంటుందని వాపోయాడు.
లారీని ఢీ కొన్న ఆటో.. ఇద్దరికి గాయాలు
మేదరమెట్ల: ఆగిఉన్న లారీని వెనుక నుంచి వచ్చిన టాటాఏస్ ఆటో ఢీ కొన్న సంఘటన జాతీయ రహదారిలోని పి.గుడిపాడు గాజు ఫ్యాక్టరీ వద్ద మంగళవారం జరిగింది. బెంగళూరు నుంచి విజయవాడకు వెళుతున్న కొరియర్ లారీ పి.గుడిపాడు జాతీయరహదారి గాజు ఫ్యాక్టరీ సమీపంలో రోడ్డు పక్కన నిలిపిఉంది. ఒంగోలు వైపు నుంచి వస్తున్న టాటాఏస్ ఆటో డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో అదుపు తప్పిన ఆటో ఆగిఉన్న లారీని ఢీ కొంది. దీంతో లారీలోని డ్రైవర్‌కు.. ఆటో డ్రైవర్‌కు గాయాలు కాగా 108 వాహనంలో అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మేదరమెట్ల పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
10 మంది వైఎస్సార్ సీపీ నేతల విచారణ
సత్తెనపల్లి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గత నెల 18న పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల పర్యటన సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారంటూ నమోదైన అక్రమ కేసులో 10 మంది వైఎస్సార్ సీపీ నేతలను మంగళవారం సత్తెనపల్లిటౌన్ పోలీస్టేషన్‌లో సీఐ నాగమల్లేశ్వరరావు విచారించారు. సత్తెనపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, సీనియర్ న్యాయవాది పెండెం బాబురావుతో పాటు నాయకులు జూపల్లి పాల్, జడా ప్రసాద్, కూకుట్ల శ్రీనివాసరావు, అజయ్‌రెడ్డి, నవీన్‌రెడ్డి, పవన్‌కుమార్, ప్రమోద్,వినోద్, ఉల్లం.శ్రీనులను విచారించారు.

రేవులో పడి వ్యక్తి మృతి