
రెండు ఆటోలు ఢీ– ఏడుగురికి గాయాలు
పులిగడ్డ(అవనిగడ్డ): స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలోని పులిగడ్డ టోల్‌ప్లాజా సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురికి గాయాలయ్యాయి. ఎస్‌ఐ శ్రీనివాస్ అందించిన వివరాల ప్రకారం బాపట్ల జిల్లా వేమూరుకు చెందిన కొందరు ఆటోలో మోపిదేవి ఆలయానికి వచ్చి తిరిగి వెళుతుండగా, రేపల్లె వైపు నుంచి వస్తున్న కోడిగుడ్ల ఆటో లారీని తప్పించబోయి ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న వీరరాఘవమ్మ, కోసూరు అరుణతోపాటు మరో ఐదుగురికి గాయాలయ్యాయి. వీరరాఘవమ్మ, అరుణలను మచిలీపట్నం తరలించగా, స్వల్పగాయాలైన మిగిలిన వారిని స్థానిక ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.
నా భార్య కారణంగానే చనిపోతున్నా..
సెల్ఫీ వీడియో తీసుకొని
యువకుడు ఆత్మహత్య
తాడేపల్లి రూరల్: తన చావుకు భార్య కారణమని పేర్కొంటూ ఓ యువకుడు సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. సేకరించిన వివరాల ప్రకారం... తాడేపల్లి పట్టణ పరిధిలోని నులకపేటకు చెందిన బ్రహ్మయ్య (30) సీసీ కెమెరాల టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. మంగళగిరి టిడ్కో నివాసాల్లో ఉంటున్న యువతితో వివాహం జరిగింది. ఆమె ప్రవర్తన సరిగ్గా లేదని పుట్టింటికి పంపించేశాడు. అందరూ బ్రహ్మయ్యను బతిమిలాడితే ఆమెను కాపురానికి తీసుకొచ్చినట్లు బంధువులు తెలిపారు. అత్తాకోడళ్ల గొడవల కారణంగా బ్రహ్మయ్య సొంత ఇంటి నుంచి ఉండవల్లి అమరావతి రోడ్‌లోని ఒక ఇంటిలో అద్దెకు దిగాడు. అక్కడ మళ్లీ ఆమె ఫోనులో ఎక్కువగా మాట్లాడుతుండటంతో గొడవలు జరిగాయి. ఈలోగా ఆషాఢ మాసం రావడంతో పుట్టింటికి వెళ్లింది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో తన చావుకు భార్య కారణం అంటూ సెల్ఫీ వీడియో తీసుకొని బ్రహ్మయ్య ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తాడేపల్లి పోలీసులు వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మంగళగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. భర్త చనిపోయిన ఏడాదికే ఇలా కుమారుడు కూడా ఆత్మహత్య చేసుకోవడంతో బ్రహ్మయ్య తల్లి కన్నీరుమున్నీరైంది. ఇష్టం లేకపోతే విడాకులు తీసుకుందామని చెప్పినా ఎందుకు ఇలా చేశావని ఆవేదన వ్యక్తం చేసింది. తన కుమారుడి చావుకు కారణమైన కోడలు, ఆమె ప్రియుడిని శిక్షించాలని డిమాండ్ చేసింది.
లైంగికదాడి కేసులో
వ్యక్తికి రిమాండ్
చీరాల: బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి చీరాల కోర్టు 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించినట్లు వన్‌టౌన్ ఎస్.ఐ జి.రాజ్యలక్ష్మి బుధవారం తెలిపారు. పట్టణంలోని ఓ మైనర్ బాలికపై అదే ప్రాంతానికి చెందిన పుల్లేటికుర్తి పుల్లయ్య అనే వ్యక్తి లైంగిక దాడికి ప్రయత్నించినట్లు సదరు బాలిక మంగళవారం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు దర్యాప్తులో భాగంగా ఎస్‌ఐ జి.రాజ్యలక్ష్మి బుధవారం ఉదయం నిందితుడిని ఇంటి వద్ద అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు,

రెండు ఆటోలు ఢీ– ఏడుగురికి గాయాలు