
అంధకారంలో బాపట్ల పట్టణం
బాపట్ల: మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులు ఆదివారం అర్ధరాత్రి నుంచి సమ్మె బాట పట్టారు. పురపాలక సంఘంలో విద్యుత్తు, తాగునీరు ఇతర ఇంజినీరింగ్ విభాగాలలో సేవలు నిలిచిపోయాయి. పట్టణం అంధకారంలోకి వెళ్లిపోయింది. కార్మికులు విధులను బహిష్కరించి మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమ్మె శిబిరంలో బైఠాయించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మెలో పాల్గొన్న కార్మికులు తమ న్యాయమైన సమస్యలు పరిష్కారం అయ్యేవరకు విధుల్లోకి హాజరయ్యేది లేదని మొండికేసి కూర్చున్నారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి మజుందర్ మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలని కార్మికులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని తెలిపారు. చాలీచాలని జీతాలతో జీవనం సాగించలేక ఇబ్బంది పడుతున్నారని వాపోయారు. కార్మికుల సమ్మెతో పట్టణంలో ప్రధానంగా తాగునీరు, విద్యుత్తు వంటి విధులకు విఘాతం కలిగి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. శిబిరంలో సీఐటీయూ నాయకులు శరత్, జిల్లా మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల యూనియన్ నాయకులు రత్నం, నాని, అశోక్, పట్టణ మున్సిపల్ ఇంజినీరింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు మురళీకృష్ణ, హరిబాబు, వెంకటేశ్వర రెడ్డి, సాంబిరెడ్డి, ప్రమీల, నరేష్ పాల్గొన్నారు.