జిల్లా అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం | - | Sakshi
Sakshi News home page

జిల్లా అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం

Jul 9 2025 6:49 AM | Updated on Jul 9 2025 6:49 AM

జిల్లా అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం

జిల్లా అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం

గుంటూరు వెస్ట్‌: జిల్లాను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఇన్‌చార్జి మంత్రి కందుల దుర్గేష్‌ తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా సమీక్షా సమావేశంలో మంత్రితోపాటు జిల్లా కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి, జెడ్పీ చైర్‌పర్సన్‌ కత్తెర హెని క్రిస్టినా, రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, శాసనమండలి సభ్యులు చంద్రగిరి ఏసురత్నం, మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్యేలు గళ్లా మాధవి, మొహమ్మద్‌ నసీర్‌ అహ్మద్‌, ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌, తెనాలి శ్రావణ్‌కుమార్‌, జీఎంసీ కమిషనర్‌ పులి శ్రీనివాసులు, తెనాలి సబ్‌ కలెక్టర్‌ సంజనా సింహ, తదితరులు పాల్గొన్నారు. ఇన్‌చార్జి మంత్రి దుర్గేష్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో పేదరికం లేని సమాజాన్ని నెలకొల్పేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సమావేశంలో జీడీసీసీ బ్యాంక్‌ చైర్మన్‌ మక్కెన మల్లికార్జునరావు, బీసీఎంఎస్‌ చైర్మన్‌ వడ్రాణం హరిబాబు, డీఆర్వో షేక్‌ ఖాజావలి, ఆర్డీవో కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

అధికారులలో కొరవడిన సమన్వయం

జిల్లా సమీక్షా సమావేశంలో సమన్వయం లేకుండా పోయింది. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ సమావేశ మందిరంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి కందుల దుర్గేష్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులకు, అధికారులకు మధ్య ఎక్కడా సమన్వయం లేకపోవడం గమనార్హం. సమావేశంలో తల్లికి వందనంపై చర్చ జరిగేటప్పుడు పూర్తి వివరాలు డీఈఓ రేణుక వెల్లడించలేకపోయారు. దీంతో శాసనసభ్యుడు ధూళిపాళ్ళ నరేంద్ర, తెనాలి శ్రావణ్‌ కుమార్‌లు నిలదీశారు. కొందరికి రూ.13 వేలు, మరికొందరికి రూ.10 వేలు ఎందుకు పడుతున్నాయని శాసన సభ్యులు ప్రశ్నించగా అధికారుల వద్ద సమాధానం కరువైంది. గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నామని వెల్లడించారు. అర్హత ఉన్నప్పటికీ ఎందుకు నగదు జమ చేయలేదని నిలదీశారు. కలెక్టర్‌ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. దీంతోపాటు సీసీఆర్సీ కార్డులతోపాటు కౌలు రైతులకు రుణాలు లక్ష్యాల మేరకు ఎందుకివ్వలేదని ప్రశ్నించినప్పుడు కూడా పర్యవేక్షిస్తున్నామని అధికారులు దాటవేత ధోరణిలో బదులిచ్చారు. ఇక పీ4 విషయానికి వస్తే మరీ దారుణంగా వ్యవహరించారు. జిల్లాలో గుంటూరు తూర్పు నియోజకవర్గానికి 17,050, పశ్చిమకు 14,757, మంగళగిరికి 9,968, పొన్నూరుకు 9,632, ప్రత్తిపాడుకు 6,700, తెనాలికి 11,173 మందిని ఆదుకోవాలని లక్ష్యాలుగా నిర్ణయిస్తే ఒక్కరు కూడా ఎంత మందికి న్యాయం చేవామో చెప్పలేదు. ఇంకా పూర్తి స్థాయి మార్గదర్శకాలు రూపొందించలేదని తెలిసింది. ఈ సమావేశానికి కూడా మంగళగిరి శాసన సభ్యులు, మంత్రి నారా లోకేష్‌ హాజరు కాలేదు. ఆయనతోపాటు ప్రత్తిపాడు శాసనసభ్యుడు బూర్ల రామాంజనేయులు, తెనాలి శాసన సభ్యుడైన మంత్రి నాదెండ్ల మనోహర్‌లు రాలేదు.

– ఇన్‌చార్జి మంత్రి కందుల దుర్గేష్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement