
పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తే కఠిన చర్యలు
ఎస్పీ తుషార్ డూడీ
–––––––––––––––––––––––
బాపట్లటౌన్: కళాశాలల సమీపంలో పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ తుషార్‌డూడీ హెచ్చరించారు. ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లాలోని కళాశాలలు, విద్యాసంస్థల సమీపంలో ఉన్న దుకాణాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ విద్యాసంస్థల సమీపంలో సిగరెట్లు, పాన్, గుట్కా, గంజాయి వంటి పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తే ఉపేక్షించేది లేదన్నారు. తనిఖీల అనంతరం పోలీస్ అధికారులు విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. సిగరెట్లు, పాన్, గుట్కా, గంజాయి, ఇతర పొగాకు ఉత్పత్తుల వలన కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, విద్యాసంస్థలకు 100 మీటర్ల దూరంలో ఉన్న దుకాణాల్లో సిగరెట్లు, పాన్, గుట్కా, గంజాయి, ఇతర పొగాకు ఉత్పత్తులు విక్రయించరాదనే నిబంధన ఉందన్నారు. నిబంధనలను ఉల్లంఘించి పొగాకు ఉత్పత్తులు, పాన్, గుట్కా వంటి వాటిని విక్రయిస్తున్న వారిపై కోట్పా చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. విద్యార్థులు ఉన్నతమైన భవిష్యత్తుపై తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారని, ఆ లక్ష్య సాధన కోసం కృషి చేసే సమయంలో విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందన్నారు.మాదకద్రవ్యాలు, నిషేధిత పొగాకు ఉత్పత్తులకు సంబంధించిన సమాచారం ఉన్నట్లయితే వెంటనే పోలీసులకు, టోల్ ఫ్రీ నంబర్ 1972 కు కాల్ చేయాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.