
ఉద్యోగులు అక్రమాలకు పాల్పడితే చర్యలు
డ్వామా పీడీ ఎ.వి.విజయలక్ష్మి
చీరాలటౌన్: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఉపాధి కల్పించి వలసలు నిర్మూలించేందుకు ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో సిబ్బంది, ఉద్యోగులు అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని బాపట్ల జిల్లా డ్వామా పీడీ ఎ.వి.విజయలక్ష్మి హెచ్చరించారు. మంగళవారం చీరాల మండల పరిషత్ కార్యాలయంలో 2024 ఏప్రిల్ నుంచి మార్చి 2025 వరకు జరిగిన ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. సామాజిక తనిఖీ బృందం చీరాల మండలంలోని గ్రామ పంచాయతీల్లో చేపట్టిన పనులపై తనిఖీ చేపట్టారు. మండలంలో చేపట్టిన 1243 పనులు, ఖర్చులు రూ.9 కోట్లు, పంచాయతీరాజ్ నిధులు రూ.1.82 కోట్లు, ఎన్‌ఆర్‌ఈజీఎన్ రూ.6.95 కోట్లతో ఉపాధి పనులు చేశారు. పంట కాలువలు, పూడికతీత పనులు, గోకులం షెడ్లు 10 నిర్మాణాలు, ఉపాధి కూలీలకు చెల్లించిన నగదు, వసతులు, మెటీరియల్ సరఫరా, మొక్కల సంరక్షణ తదితర పనులపై సామాజిక తనిఖీ బృందం పంచాయతీల వారిగా చేసిన పనులను వివరించారు. మండలంలోని 14 గ్రామ పంచాయతీల్లో చేసిన పనులు, చెల్లింపుల వివరాలను, కూలీలు వివరాలను సిబ్బంది అధికారులకు వివరించారు. సామాజిక తనిఖీకి ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా పీడీ విజయలక్ష్మి వ్యవహరించగా జిల్లా హెచ్‌ఆర్ మేనేజర్ చంద్రశేఖర్, ఎంపీడీవో శివన్నారాయణ, జిల్లా ఏపీడీ కోటయ్య నాయక్, ఏపీవో దాసు, ఫీల్డు అసిస్టెంట్లు పాల్గొన్నారు. ఉపాధి పనుల గురించి డ్వామా పీడీ పలు సూచనలు చేశారు.