
పంచాయతీ కార్యదర్శులపై పనిభారం
బాపట్ల టౌన్: పంచాయతీ కార్యదర్శులపై రోజురోజుకు పెరుగుతున్న పనిభారాన్ని తగ్గించాలని సీనియర్ పంచాయతీ కార్యదర్శి పల్నాటి శ్రీరాములు అన్నారు. పట్టణంలోని ఎన్‌జీవో హోంలో ఆదివారం జిల్లాలోని పంచాయతీ కార్యదర్శుల సమావేశం నిర్వహించారు. పల్నాటి శ్రీరాములు మాట్లాడుతూ గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్య పనుల నిర్వహణలో పంచాయతీ కార్యదర్శులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ముఖ్యంగా సరిపడా నిధులు లేకపోవడం వల్ల పారిశుద్ధ్య పనుల్లో కీలక పాత్ర పోషించే క్లాప్ మిత్రాలకు ఇచ్చే నెల జీతం రూ.6000 చాలక పోవడంతో పని చేసేందుకు ఎక్కువ మంది ముందుకు రావడంలేదన్నారు. ప్రభుత్వమే నెలకు పదివేల రూపాయలు చొప్పున నేరుగా చెల్లించాలన్నారు. ప్రస్తుతం పాత రిక్షాల స్థానంలో ఆటోలు, ట్రాక్టర్లు మంజూరు చేయాలన్నారు. పంచాయతీ కార్యదర్శిని గ్రామ పంచాయతీ విధులకు మాత్రమే పరిమితం చేసి సచివాలయ డీడీవో బాధ్యతలు నుంచి తొలగించాలన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల సర్వేలను చేయించే బాధ్యత ఒక పంచాయతీ కార్యదర్శికి మాత్రమే అప్పగించడం వలన పని ఒత్తిడికి గురవుతున్నామన్నారు. ఐవీఆర్‌ఎస్ ఫోన్ కాల్స్ ద్వారా పంచాయతీ కార్యదర్శుల పనితీరు అంచనా వేయడం సమంజసం కాదన్నారు. పారిశుద్ధ్యం లోపించిందనే పేరుతో ఉన్నతాధికారులు పంచాయతీ కార్యదర్శులపై సస్పెన్షన్ లాంటి చర్యలు తీసుకోవడం దుర్మార్గం అన్నారు. ఇటీవల వేటపాలెం మండలం పుల్లరిపాలెం పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేశారని, ఆ ఉత్తర్వులు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీనియర్ పంచాయతీ కార్యదర్శులు డి.మురళి బాపూజీ, డి.సుజాత, ఎం.శ్రీనివాసరావు, షేక్ జిలాని పాల్గొన్నారు.
సీనియర్ పంచాయతీ కార్యదర్శి
పల్నాటి శ్రీరాములు