
నేడు ‘రీ కాల్ చంద్రబాబు మేనిఫెస్టో’పై సమావేశం
రేపల్లె: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా చంద్రబాబు చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించేందుకు బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం చేపట్టినట్లు వైఎస్సార్‌సీపీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఈవూరు గణేష్ తెలిపారు. గుళ్ళపల్లిలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అధికారం కోసం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తుందన్నారు. సంవత్సర కాలంలో ఏ ఒక్క హామీని అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను దగా చేసిందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి ప్రజలకు తెలియజేసేందుకు ‘రీ కాల్ చంద్రబాబు మేనిఫెస్టో’ పేరుతో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. దీనిపై శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు గుళ్ళపల్లిలోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం జరుగుతుందన్నారు. సమావేశానికి మాజీ మంత్రి, పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మేరుగ నాగార్జున, బాపట్ల పార్లమెంటరీ పరిశీలకులు, ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు హాజరవుతారన్నారు. సమావేశానికి నియోజకవర్గంలోని మండల పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా కమిటీల నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని ఆయన కోరారు.
రేపు చీరాలలో ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ’
చీరాల: రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేయడంపై పార్టీ ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కరణం వెంకటేష్‌బాబు గురువారం తెలిపారు. చీరాల మండలం రామకృష్ణాపురంలోని క్యాంపు కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం 3గంటలకు జరిగే కార్యక్రమానికి ఎమ్మెల్సీ, జిల్లా పరిశీలకులు తూమాటి మాధవరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు మేరుగు నాగార్జున హాజరవుతారన్నారు. కార్యక్రమానికి జిల్లాలోని పార్టీ వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులు, చీరాల, వేటపాలెం మండలాల, పట్టణ అధ్యక్షులు, నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కౌన్సిలర్లు, కో–ఆప్షన్ మెంబర్లు, కార్యకర్తలు హాజరుకావాలని కోరారు.
రేపు ఇంకొల్లులో నియోజకవర్గ స్థాయి సమావేశం
పర్చూరు(చినగంజాం): బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ నియోజకవర్గ స్థాయి కార్యక్రమం ఇంకొల్లు మండలం పావులూరు గ్రామంలోని ఇన్‌చార్జ్ గాదె మధుసూదనరెడ్డి అధ్యక్షతన శనివారం ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు పర్చూరు పార్టీ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పార్టీ అధ్యక్షుడు మేరుగు నాగార్జున, ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు పాల్గొనున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి మండల కన్వీనర్‌లు మాజీ మండల కన్వీనర్‌లు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, అనుబంధ విభాగం అధ్యక్షుడు వివిధ హోదాల్లో ఉన్న ప్రజా ప్రతినిధులు, ముఖ్యనాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరారు.