పంచాయతీల్లో సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

పంచాయతీల్లో సమస్యలు పరిష్కరించాలి

Jul 1 2025 4:16 AM | Updated on Jul 1 2025 4:16 AM

పంచాయతీల్లో సమస్యలు పరిష్కరించాలి

పంచాయతీల్లో సమస్యలు పరిష్కరించాలి

● జిల్లా పంచాయతీరాజ్‌ విభాగం అధ్యక్షుడు తోకల కృష్ణమోహన్‌ ● కలెక్టర్‌ కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందించిన నాయకులు

బాపట్ల/పర్చూరు(చినగంజాం): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామ పంచాయతీల్లో నెలకొన్న సమస్యలను తక్షణం పరిష్కరించాలని వైఎస్సార్‌ సీపీ బాపట్ల జిల్లా పంచాయతీరాజ్‌ విభాగం అధ్యక్షుడు తోకల కృష్ణమోహన్‌ డిమాండ్‌ చేశారు. వైఎస్సార్‌ సీపీ పంచాయతీరాజ్‌ విభాగం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు సోమవారం జిల్లా కేంద్రం బాపట్లలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తూ కేంద్రం విడుదల చేస్తున్న నిధులను సైతం దారి మళ్లిస్తోందన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులను అగౌరవపరుస్తూ చట్టాలను తుంగలో తొక్కుతున్నది వారు ఆరోపించారు. ఉపాధి హామీ పథకాన్ని టీడీపీ నేతలు కడుపు నింపుకునే జేబు సంస్థగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

ఉపాధి హామీలో పెద్దఎత్తున అవినీతి..

రాష్ట్రంలో జరుగుతున్న ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న అవినీతిపై కేంద్ర ప్రభుత్వం తక్షణం విచారణ జరిపించాలన్నారు. చట్టం మేరకు ఉపాధి హామీ పనులను గ్రామ పంచాయతీల ద్వారానే జరిపించాలని, కూలీలకు సకాలంలో వేతనాలు చెల్లించాలని, సర్పంచ్‌లకు తల్లికి వందనం పథకం వర్తింపజేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 15వ ఫైనాన్స్‌ కమిషన్‌ విడుదల చేసిన నిధులు రూ.1150 కోట్లు స్థానిక సంస్థలకు వెంటనే జత చేయాలన్నారు. బిల్లుల చెల్లింపులలో రాజకీయ జోక్యం నివారించాలని, 1320 మంది పంచాయతీ సెక్రటరీలను తక్షణమే పోస్టింగులు ఇచ్చి పెండింగ్‌లో ఉన్న 9 నెలలు జీతాలు విడుదల చేయాలన్నారు. సర్పంచ్‌, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీల గౌరవ వేతనాలు వెంటనే పెంచాలని, ప్రస్తుతం అమలులో ఉన్న గౌరవ వేతనాలను సకాలంలో చెల్లించాలని వారు డిమాండ్‌లను చేస్తూ వినతి పత్రాన్ని సమర్పించారు. కార్యక్రమంలో పర్చూరు నియోజకవర్గ పంచాయతీరాజ్‌ అధ్యక్షులు ఆసోది బ్రహ్మానందరెడ్డి, బాపట్ల నియోజకవర్గ అధ్యక్షుడు పీ ప్రసాద్‌, ఎం.ఏడుకొండలురెడ్డి, నాలుగు నియోజకవర్గాల పంచాయతీరాజ్‌ అధ్యక్షుడు, మాజీ ఏఎంసీ చైర్మన్‌ జీ కృష్ణమూర్తి, ఉప్పుటూరు సర్పంచ్‌ యర్రాకులు తిరుమలేశ్వరరావు, ఎం హేమంత్‌కుమార్‌రెడ్డి, వీ గోపి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement