ప్రభుత్వ తీరుపై నినదించిన మహిళలు
బాపట్లటౌన్: కూటమి పాలన తీరుపై మహిళలు గర్జించారు. మహిళలపై జరుగుతున్న హత్యలు, అఘాయిత్యాలను నిరసిస్తూ మంగళవారం వైఎస్సార్ సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో బాపట్లలోని పార్టీ కార్యాలయం నుంచి అంబేడ్కర్ సర్కిల్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. సర్కిల్ వద్ద నిరసన తెలిపారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు.
రాష్ట్రం రావణకాష్టం
కూటమి సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రం రావణకాష్టంగా మారిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మేరుగ నాగార్జున విమర్శించారు. రాష్ట్రంలో మహిళలకు, బాలికలకు రక్షణ, భద్రత లేకుండా పోయిందన్నారు. శాంతిభద్రతల నిర్వహణలో చంద్రబాబునాయుడు విఫలమయ్యారని అన్నారు. అనంతపురంలో ఇంటర్మీడియట్ చదువుతున్న గిరిజన బాలిక సాకె తన్మయిని అత్యంత దారుణంగా హత్యచేసినా, వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఈనెల 3న తమ కుమార్తె కనిపించడంలేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఆమెను రక్షించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం, డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే నడుస్తున్నాయన్నారు.
డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్న బాబు
రాష్ట్ర పొలిటికల్ అడ్వయిజరీ మెంబర్, మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి మాట్లాడుతూ చంద్రబాబు తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్నారన్నారు. పేరుకు మహిళ హోం మినిస్టర్ అయినా, పెత్తనం అంతా చంద్రబాబుదేనని అన్నారు. గతంలో కాల్‌మనీ, సెక్స్‌రాకెట్‌లను పెంచిపోషించిన ఘనుడు కూడా చంద్రబాబే అన్నారు. మహిళలకు ఒక్క పథకం కూడా అమలుచేయకపోవడం వలన మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జగన్ సర్కార్‌లో 11 పథకాలు మహిళలకే ప్రత్యేకంగా ఇచ్చారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షులు కోకి రాఘవరెడ్డి, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు అంజని ప్రసాద్‌రెడ్డి, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి నక్కా వీరారెడ్డి, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి మల్లెల పవన్, రాష్ట్ర మహిళా విభాగం జనరల్ సెక్రటరి జి. పుష్పరాజ్యం, నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు వేల్పుల మీరాబీ, బాపట్ల ఎంపీపీ చిన్నపోతుల హరిబాబు, కర్లపాలెం ఎంపీపీ యారం వనజ, బాపట్ల మండల ఉపాధ్యక్షురాలు షేక్ అప్సర, పట్టణ వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు కాగిత సుధీర్‌బాబు, మండల అధ్యక్షులు మరుప్రోలు ఏడుకొండలురెడ్డి మహిళా ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.
బాపట్లలో నిరసన ప్రదర్శన భారీగా తరలివచ్చిన మహిళలు మహిళలకు రక్షణ కల్పించడంలో కూటమి సర్కారు విఫలం వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు మేరుగ నాగార్జున


