ఉపాధి హామీ చట్టం రద్దుతో కష్టాలు
అద్దంకి: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయడం దుర్మార్గమని సీపీఎం పట్టణ కార్యదర్శి తంగిరాల వెంకటేశ్వర్లు అన్నారు. కేంద్ర ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా అద్దంకిలో నిరసనగా శుక్రవారం ిసీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి జీ రామ్ జీ పథకాన్ని తీసుకురావడం అంటే గ్రామీణ ప్రాంతంలో ప్రజలకు పని హక్కుగా ఉన్న ఉపాధి చట్టాన్ని లేకుండా చేయడమేనన్నారు. దీని ద్వారా గ్రామాల్లో కొద్దిమందిగా ఉన్న భూస్వాములకు అనుకూలంగా చౌకగా కూలీలు దొరికేలా చేస్తున్నట్లు ఆరోపించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు ఎస్‌కే కరీం, కోమరగిరి ప్రమీల, హనుమంతరావు, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.


