జిల్లా పోలీసులకు రాష్ట్ర స్థాయి అవార్డు
బాపట్ల టౌన్: పోలీస్‌లకు ఎంతో ప్రతిష్టాత్మకమైన రాష్ట్రస్థాయి ఏబీసీడీ అవార్డు బాపట్ల జిల్లాకు రావడం అభినందనీయం అని డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా తెలిపారు. రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో శుక్రవారం జిల్లా ఎస్పీ, సిబ్బందికి సంబంధిత అవార్డు, ధ్రువపత్రం అందజేశారు. ఎస్పీ బి. ఉమామహేశ్వర్ మాట్లాడుతూ.. పర్యాటక శాఖకు చెందిన వెబ్సైట్లను పోలిన నకిలీ వెబ్సైట్లను రూపొందించి మోసం చేస్తున్న కేసును సమర్థంగా దర్యాప్తు చేసినందుకు అవార్డు ఫర్ బెస్ట్ క్రైం డెటెన్షన్ రావడం హర్షణీయం అన్నారు. పర్యాటక శాఖకు చెందిన వెబ్‌సైట్లు, ప్రఖ్యాతిగాంచిన పలు దేవస్థానాలకు చెందిన వెబ్సైట్లను పోలిన నకిలీ వెబ్సైట్లను రూపొందించి దుండగులు యాత్రికులు, భక్తుల నగదు కొల్లగొట్టారని పేర్కొన్నారు. ఈ కేసును సవాలుగా స్వీకరించిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన సైబర్ నేరగాళ్లను అరెస్టు చేశారన్నారు. వీరు మొత్తం 18 రాష్ట్రాల్లో 127 ఫిర్యాదుల ద్వారా సుమారు రూ.46 లక్షల వరకు మోసం చేసినట్లు గుర్తించామని తెలిపారు. నిందితులు పరంజిత్ (20), బిట్టూ (21)లను అరెస్టు చేశామన్నారు. కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన బాపట్ల డీఎస్పీ జి.రామాంజనేయులు, బాపట్ల రూరల్ సీఐ కె. శ్రీనివాసరావు, సైబర్ సెల్ రిజర్వ్ సీఐ టి. శ్రీకాంత్, ఐటీ కోర్ ఎస్‌ఐ షేక్ నాయబ్‌రసూల్, బాపట్ల రూరల్ హెడ్ కానిస్టేబుళ్లు పి. సుబ్బరాజు, వి. రమేష్, ఐటీ కోర్ కానిస్టేబుల్ డి. సురేష్, బాపట్ల రూరల్ కానిస్టేబుళ్లు కె.నాగరాజు, కె.బుజ్జి రాజు, ఐటీ కోర్ మహిళా కానిస్టేబుళ్లు డి.తబిత, ఐ.కీర్తి తదితరులు అభినందనలు పొందిన వారిలో ఉన్నారు.
ఎస్పీని అభినందించిన డీజీపీ


