సంతోష్ ట్రోఫీ ఫుట్‌బాల్ జట్టుకు చీరాల క్రీడాకారుడు
చీరాల రూరల్: ప్రతిష్టాత్మకంగా జాతీయ స్థాయిలో నిర్వహించే సంతోష్ ట్రోఫీ ఫుట్‌బాల్ జట్టుకు చీరాల క్రీడాకారుడు కంచర్ల సుభాష్ ఎంపికయ్యాడు. చీరాల జయంతి పేటకు చెందిన కంచర్ల సుభాష్ చిన్నతనం నుంచి చదువుతో పాటు ఫుట్‌బాల్ క్రీడలో రాణిస్తున్నాడు. ప్రస్తుతం సెయింట్ ఆన్స్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. చిన్నతనం నుంచే అతడు ఫుట్‌బాల్‌లో ఆరంగేట్రం చేశాడు. ఐఎల్‌టీకి కంపెనీకి చెందిన క్రీడామైదానం తన ఇంటికి దగ్గరగా ఉండడంతో నిత్యం సీనియర్ క్రీడాకారులతో కలిసి ఉదయం, సాయంత్రం వేళల్లో సాధన చేసేవాడు. జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ఏడాది జూలైలో నిర్వహించిన సీనియర్ మెన్ ఫుట్‌బాల్ జిల్లాస్థాయి సెలక్షన్స్‌లో అత్యధిక ప్రతిభ కనబరచి జిల్లా జట్టుకు ఎంపికయ్యాడు.
● ఆగస్టులో నిర్వహించిన సీనియర్ మెన్ జోనల్ మీట్‌లో బాపట్ల జిల్లా ఫుట్‌బాల్ జట్టులో పాల్గొని జట్టును విజేతగా నిలిపాడు. –
● విశాఖపట్టణంలో జరిగిన రాష్ట్రస్థాయి సీనియర్ మెన్ మీట్‌లో పాల్గొని తన అత్యుత్తమ ప్రదర్శనతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. తన అత్యుత్తమ ప్రతిభతో సుభాష్ సెలక్టర్లను ఆకర్షించాడు. దీంతో సెలక్టర్లు జాతీయ స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సంతోష్ ట్రోఫీ జట్టుకు సుభాష్‌ను ఎంపిక చేశారు.
● బాపట్ల జిల్లా నుంచి సంతోష్ ట్రోఫికి ఎంపికై న సుభాష్‌ను జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు వాసిమళ్ల విజయకుమార్, సమ్మర్ ఫుట్‌బాల్ క్యాంపు ఇన్‌చార్జ్ బొనిగల ప్రేమయ్య, జోనల్ కోఆర్డినేటర్ ఎన్. దేవదాసు, కోచ్ ప్రసన్న, ఎన్. నరేష్, సీనియర్ క్రీడాకారులతో పాటు కుటుంబ సభ్యులు సుభాష్‌ను అభినందించారు. మున్ముందు భారత జట్టులో చోటుసంపాదించి దేశం తరఫున ఆడాలని వారు ఆకాంక్షించారు.
ఎంపికపై అభినందించిన ఫుట్‌బాల్
అసోసియేషన్ సభ్యులు, క్రీడాకారులు


