ప్రేమమూర్తిగా భువిలోకి వచ్చిన ఏసుక్రీస్తు
బాపట్ల: ప్రేమమూర్తిగా భువిలోకి వచ్చిన ఏసుక్రీస్తు క్షమాగుణాలు, సూక్తులు నేటి సమాజానికి మార్గదర్శకం అని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ తెలిపారు. క్రిస్టియన్, ముస్లిం మైనార్టీ సంక్షేమశాఖ ద్వారా శుక్రవారం స్థానిక పట్టణంలోని షాదీఖానా భవన్‌లో సెమీ క్రిస్మస్ వేడుకలు, తేనీటి విందు నిర్వహించారు. కలెక్టర్ క్రిస్మస్ కేకును కట్ చేసి క్రైస్తవ పెద్దలు, పాస్టర్లకు పంచిపెట్టారు. అనంతరం కొవ్వొత్తులతో క్యాండిల్ లైట్ సర్వీస్ నిర్వహించారు. ఏసుక్రీస్తు ప్రభువు అంటేనే ప్రేమ, దయ, క్షమ గుణాలకు ప్రతిరూపమని కలెక్టర్ చెప్పారు. ఆయన పుట్టినరోజును పండుగగా నిర్వహించడం సంతోషదాయకమని పేర్కొన్నారు. ఆయన్ను గుర్తు చేసుకోవడమే ఆనందాన్ని కలిగిస్తుందన్నారు. ప్రపంచ దేశాలన్నీ క్రిస్మస్ పండుగను గొప్ప వేడుకగా జరుపుకుంటారని, జిల్లా ప్రజలు కూడా ఘనంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. జిల్లా ప్రజలంతా శాంతి, సమాధానాలతో కలిసిమెలిసి ఆనందంగా ఉండాలని ఆయన సూచించారు. కర్ణాటక రాష్ట్రంలో క్రిస్టియన్ మిషనరీ పాఠశాల మా ఊరికి దగ్గరలోనే ఉండేదని, అక్కడ చదివే విద్యార్థులు అన్ని రంగాల్లో నంబర్ వన్‌గా నిలిచేవారని గుర్తు చేసుకున్నారు. ఏసుక్రీస్తు సూక్తులు వారిని ఎంతగానో ప్రభావితం చేశాయని, సమాజంలో పరిపూర్ణ వ్యక్తులుగా మెలిగేవారని తెలిపారు. అదే స్ఫూర్తితో క్రైస్తవ సోదరులు సమాజానికి మార్గదర్శకంగా నిలవాలన్నారు. క్రిస్మస్ పండుగ అందరిలో సంతోషాన్ని నింపాలని జిల్లా క్రిస్టియన్, ముస్లిం మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి జగన్నాథం పార్థసారథి తెలిపారు. క్రైస్తవ సోదరులంతా సమాధానంతో పండుగను వేడుకగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. మానవాళి రక్షణ కోసమే భూలోకంలో ఏసుక్రీస్తు జన్మించారని బాపట్ల ఆర్డీఓ పి. గ్లోరియా తెలిపారు. ప్రజలకు మోక్షమార్గం చూపిన ఆయన అందరి హృదయాలలో నీతి, సమానత్వాన్ని స్థాపించారని వివరించారు.మేజర్ ఏసు పాదం వాక్యోపదేశం చేశారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ లవన్న, మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, తహసీల్దార్ షాలీమా, ఫాదర్ ఇన్నయ్య, రెవరెండ్ పి. వరబాబు పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్


