పారిశ్రామికవేత్తలను తయారు చేయాలి
గవర్నర్ ప్రశంసలు
బాపట్ల: ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారుచేయడమే లక్ష్యంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ తెలిపారు. జిల్లా స్థాయి పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లో జరిగింది. పరిశ్రమలను ప్రోత్సహించడానికి వేగంగా అనుమతులు ఇచ్చేలా సింగిల్ డెస్క్ పోర్టల్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని కలెక్టర్ చెప్పారు. జిల్లాలో రెండు భారీ పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుందన్నారు. గాజు ఉత్పత్తి పరిశ్రమ, సౌర విద్యుత్ పలకల ఉత్పత్తి పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందాలు జరిగాయన్నారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ జీఎం వై.రామకృష్ణ, ఎల్‌డీఎం శివకృష్ణ, జిల్లా స్థాయి కమిటీలోని వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఆ ఖాతాల్లోని నగదు తీసుకోవాలి
మనుగడలో లేని బ్యాంక్ ఖాతాల నుంచి నగదును తిరిగి తీసుకోవడానికి ఆర్.బి.ఐ. అనుమతులు ఇచ్చిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. మీ డబ్బు–మీ హక్కు పేరుతో యూనియన్ బ్యాంక్ రూపొందించిన గోడ పత్రాలను శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ విడుదల చేశారు. ఎల్‌డీఎం శివకృష్ణ, పరిశ్రమల శాఖ మేనేజర్ రామకృష్ణ, డీఎల్‌డీవో పద్మావతి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్
సాయుధ దళాల పతాక నిధికి రాష్ట్రంలోనే అత్యధికంగా నిధులు సేకరించిన జిల్లాల్లో రెండో స్థానంలో నిలిచినందుకు బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్‌కు అవార్డు లభించింది. గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ శుక్రవారం ఉదయం లోక్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును అందించారు. సైనిక కుటుంబాలను ఆదుకునేందుకు ఈ మొత్తం సేకరించారు.


