
ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలి
యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు
గుంటూరు ఎడ్యుకేషన్: బదిలీలు, ఉద్యోగోన్నతుల్లో ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. బ్రాడీపేటలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో గురువారం ఉపాధ్యాయ బదిలీలు, ఉద్యోగోన్నతులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ జిల్లా అధ్యక్షుడు యు. రాజశేఖర్‌రావు అధ్యక్షతన జరిగిన సదస్సులో ముఖ్య అతిథిగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... దరఖాస్తు ప్రక్రియతో ఎన్నో అంశాలు ముడి పడి ఉన్నాయని అన్నారు. ఉపాధ్యాయులు గతంలో టీఐఎస్‌లో స్వయంగా అప్‌లోడ్ చేసిన సమాచారమే ఆన్‌లైన్ పోర్టల్‌లో ఉంటుందని, దానిలో ఎటువంటి మార్పు ఉండబోదని చెప్పారు. ఆన్‌లైన్ దరఖాస్తులో ప్రత్యేక పాయింట్లు, రేషనలైజేషన్, ప్రిఫరెన్షియల్ పాయింట్లు ఇతర వివరాలను పూర్తి చేయాల్సి ఉంటుందని తెలిపారు. దరఖాస్తు సబ్‌మిట్ చేసే ముందుగా పరిశీలన చేసుకోవాలని, దరఖాస్తు ప్రింటవుట్ రెండు కాపీలను డీడీవోకు సమర్పించాలని సూచించారు. జూన్ 12న పాఠశాలలు పునః ప్రారంభమైన తరువాత అదనంగా గంట బోధించడంతోపాటు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. యూటీఎఫ్ రాష్ట్ర ప్రచురణల విభాగ చైర్మన్ ఎం. హనుమంతరావు మాట్లాడుతూ బదిలీల చట్టం, ఉపాధ్యాయులకు పాయింట్ల కేటాయింపు, పాఠశాలల స్ట్రక్చర్ వెనుక యూటీఎఫ్ పోరాటం ఉందని తెలిపారు. సదస్సులో సంఘ నాయకులు జి.వెంకటేశ్వర్లు, సీహెచ్ ఆదినారాయణ, కె. సాంబశివరావు, బి. రంగారావు, ఎం.గోవిందు, బి.ప్రసాద్, ఎం.కోటిరెడ్డి, ఎం. చిన్నయ్య, కె.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.