
వైభవంగా ప్రసన్నాంజనేయుని కల్యాణ వేడుకలు
బెల్లంకొండ: మండలంలోని బెల్లంకొండ క్రాస్ రోడ్ వద్ద గల శ్రీ కోళ్లూరు ప్రసన్నాంజనేయ స్వామి వారి జయంతి, కల్యాణ ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో శోభాయమానంగా సాగుతున్నాయి. ఐదు రోజులపాటు జరిగే ఉత్సవాల్లో గురువారం రెండో రోజు కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఉదయాన్నే స్వామి వారికి సుప్రభాత సేవ, విశేష అలంకరణలను ఆలయ అర్చకులు బొర్రా వెంకట అనంతాచార్యులు నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు, మహిళలు స్వామి వారికి పొంగళ్లను చేసి, నైవేద్యాన్ని సమర్పించారు. స్వామి వారికి విశేష ఆకు పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ప్రసన్నాంజనేయుని మాలదారులకు గురుస్వామి వెంకట నరసింహాచార్యులు ఇరుముడి కార్యక్రమాన్ని నిర్వహించారు. మధ్యాహ్నం మహానివేదన, నీరాజనం, మంత్రపుష్పాన్ని స్వామివారికి సమర్పించారు. రాత్రి 7 గంటలకు శ్రీ సువర్చలా సహిత ప్రసన్నాంజనేయ స్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.