
‘సమాజానికో బహిరంగ లేఖ’ ఆవిష్కరణ
బాపట్ల: భావితరాలకు బంగరు భవిష్యత్తును అందించాల్సిన బాధ్యత సమాజంపై ఉందని ఫోరం ఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి డాక్టర్ పి.సి.సాయిబాబు పేర్కొన్నారు. మాతృభాషలోనే ప్రాథమిక విద్య బోధించడం ముఖ్య అంశం అంటూ సమాజానికో బహిరంగ లేఖ పేరుతో ఆదివారం ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సాయిబాబు మాట్లాడుతూ పిల్లలకు పుస్తక పఠనంపై ఆసక్తిని కలిగించాలని, వారిని సరైన మార్గంలో నడిపించడం అందరి బాధ్యతని సూచించారు. పిల్లల సెల్ ఫోన్ వాడకాన్ని పరిమితం చేయాలని తెలిపారు. పుస్తక పఠనం వైపు వారిని మళ్లించడం నేటి మన కర్తవ్యంగా భావించాలని ఆయన కోరారు. ‘మరో గ్రంథాలయ ఉద్యమ’ కార్యాచరణలో భాగంగా స్థానిక శాఖా గ్రంథాలయంలో ’సమాజానికో బహిరంగ లేఖ’ కరదీపికలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఉద్యమ నాయకులు, చిత్రకారుడు గుడంశెట్టి వెంకటేశ్వర్లు, శాఖా గ్రంథాలయాధికారి ఏ. శివాజీగణేషన్, పాఠకులు, విద్యార్థులు పాల్గొన్నారు.