రాములోరి కల్యాణానికి క్షీరపురి తలంబ్రాలు | - | Sakshi
Sakshi News home page

రాములోరి కల్యాణానికి క్షీరపురి తలంబ్రాలు

Mar 24 2025 2:34 AM | Updated on Mar 24 2025 2:33 AM

చీరాల: భద్రాద్రి సీతాలక్ష్మణ సమేత శ్రీరామ చంద్రుని కల్యాణమంటేనే రెండు తెలుగు రాష్ట్రాలు వేయి కళ్లతో ఎదురు చూస్తుంటాయి. ఆ వేడుకలో వినియోగించే తలంబ్రాలను గోటితో వొలిచే అవకాశం చీరాల వాసులకు ఏళ్లుగా దక్కుతోంది. శ్రీశైలం మల్లన్న కల్యాణానికి చీరాల చేనేతలే తలపాగా తయారు చేసి లింగోద్భవ సమయాన చుట్టే అదృష్టం కూడా దక్కింది. భద్రాద్రి తలంబ్రాలు మహాసంకల్పానికి పూనుకున్న చీరాలకు చెందిన సిద్ధాంతి పి.బాలకేశవులు, మరికొందరు నియమ నిష్ఠలతో ఈ దైవకార్యాన్ని నిర్వహిస్తున్నారు.

అలా వచ్చింది అవకాశం..

చీరాలలో శ్రీ రఘురామ భక్తసేవా సమితి 2011లో 11 మందితో ఏర్పాటైంది. సమితి ఆధ్వర్యంలో పండుగలకు, ఆధ్యాత్మిక కార్యక్రమాల సమయంలో వేదపారాయణలు, అన్నదానాలను నిర్వహిస్తున్నారు. 2016లో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వెంకటేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాలను తీసుకొచ్చి, చీరాలలో ఏకాంత సేవ ఘనంగా నిర్వహించారు. దీంతో వీరికి భద్రాద్రి రామయ్య కల్యాణోత్సవానికి తలంబ్రాలు అందించే అవకాశం వచ్చింది. బాలకేశవులుకు ఉన్న రెండు ఎకరాలలో పండిన ధాన్యంతో తలంబ్రాలు తయారు చేయిస్తున్నారు. విజయదశమి నుంచి ఉగాది వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

దేశ, విదేశాలలోనూ క్రతువు...

ఈ తలంబ్రాలను తయారు చేసే క్రతువులో దేశ, విదేశాలలో ఉన్న తెలుగు వారిని కూడా భాగస్వాములు చేశారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఢిల్లీ, తమిళనాడు, ఒడిశా, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌, కేరళ భక్తులు భాగస్వాములు అయ్యారు. కమిటీ ప్రతినిధులు వాట్సప్‌ గ్రూపులు ప్రారంభించారు. భక్తులు వాటిలో చేరడంతో పర్యవేక్షకుల ద్వారా ఆయా ప్రాంతాల వారికి ధాన్యం ఇచ్చారు. ఈ ఏడాది కల్యాణానికి అవసరమైన 25 వేల కేజీల తలంబ్రాలను పంపనున్నారు.

భద్రాద్రి ఆలయానికి చీరాలలో సిద్ధం

పూర్వజన్మ సుకృతం: పొత్తూరి బాలకేశవులు

భద్రాద్రి రాములోరి కల్యాణానికి ఉపయోగించే తలంబ్రాలను అందించే అవకాశం రావడం పూర్వజన్మఫలమే. వాస్తవానికి అక్కడి వారే ఇవి తయారు చేస్తారు. అయితే మేమంతా కలిసి తలంబ్రాలు తయారు చేసిన విధానంపై దేవస్థాన అధికారులు, ధర్మకర్తలు సంతృప్తి చెంది అవకాశం కల్పించారు. దానిని సద్వినియోగం చేసుకుని వరుసగా ఈ క్రతువును మూడు సంవత్సరాలుగా కొనసాగిస్తున్నాం.

రాములోరి కల్యాణానికి క్షీరపురి తలంబ్రాలు 1
1/1

రాములోరి కల్యాణానికి క్షీరపురి తలంబ్రాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement