వేటపాలెం: స్థానిక బందావారి వీధిలో పోలీసులు సీల్ వేసిన ఇల్లు చోరీ జరిగిన సంఘటన ఆలస్యంగా గురువారం వెలుగు చూసింది. 2022లో వేటపాలెం కో–ఆరేటివ్ క్రెడిట్ సొసైటీలో రూ.25 కోట్లు డిపాజిట్‌లను సొసైటీ పాలక వర్గం గోల్ మాల్ చేసింది. ఈ కేసులో ఏ1 ముద్దాయిగా ఉన్న శ్రీరాం శ్రీనివాసరావుకి సంబంధించిన ఆస్తులను పోలీస్‌లు సీజ్ చేశారు. అందులో భాగంగా బందావారి వీధిలో ఉన్న ఇంటికి సీల్ వేశారు. అయితే సీల్ వేసిన ఇంటి వరండాలో ఉన్న ఇనుప గ్రిల్స్‌కి ఉన్న తాళం దొంగలు పగుల గొట్టి ప్రధాన ద్వారం తెరవడానికి దుండగులు యత్నించారు. అయితే ప్రధాన ద్వారం తెరుచుకోకపోవడంతో పక్కనే ఉన్న కిటికీ గ్రిల్స్ కోసి ఇంట్లోకి ప్రవేశించారు. ఇంట్లో వస్తువులన్నీ చెల్లా చెదురుగా పడవేశారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న ఎస్సై ఎం.వెంకటేశ్వర్లు చోరీకి గురైన ఇంటిని సిబ్బందితో కలిసి పరిశీలించారు. చోరీ జరిగి దాదాపు నెల పైగా అయి ఉంటుందని భావిస్తున్నారు. ప్రధాన ద్వారం తాళాలు లేకపోవడంతో లోపలికి వెళ్లి చూడటానికి వీలు పడలేదు.
ఇంటి యజమానిపై అనుమానాలు..
అయితే రూ.25 కోట్లు గోల్‌మాల్ కేసులో ప్రధాన నిందితుడైన శ్రీనివాసరావు.. నరసరాపేటలో నివాసం ఉంటున్నాడు. అతనే సీలు పగుల గొట్టించి ఇంట్లో దాచుకున్న విలువైన వస్తువులను తీయించి ఉంటాడని సొసైటీ బాధితులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏ1 ముద్దాయిని తిరిగి పోలీస్‌లు అదుపులోకి తీసుకొని పూర్తిస్థాయిలో విచారించాలని కోరుతున్నారు.
కోఆపరేటివ్ కేసులో
ఏ–1 ముద్దాయి ఇంటిలో ఘటన