అద్దంకి రూరల్: ప్రముఖ పుణ్య క్షేత్రమైన శింగరకొండ తిరునాళ్లను గురువారం ఉదయం ప్రారంభించారు. ఉత్సవాలలో భాగంగా ఉదయం గణపతి పూజ, పుణ్యహవాచన, అఖండ దీప స్థాపన, మండపారాధన నిర్వహించారు. అనంతరం ధ్వజ స్తంభ నిర్మాణ దాత మేదరమెట్ల శంకరరెడ్డితో అర్చకులు జీవ ధ్వజ పూజ చేయించారు. ఉష్ట్ర పతాకాన్ని ధ్వజారోహణ చేయించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్థాన ఏసీ తిమ్మనాయుడు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి
శింగరకొండ తిరునాళ్ల ఉత్సవాల్లో భాగంగా మొదటిరోజు బుధవారం రాత్రి ప్రసన్నాంజనేయస్వామికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పట్టు వస్త్రాలు సమర్పించారు. నగరోత్సవంలో భాగంగా రథాన్ని లాగిన అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. దేవస్థాన ఏసీ తిమ్మనాయుడు, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.
ప్రతి నిమిషానికి ప్రత్యేక బస్సు
అద్దంకి: జిల్లాలోనే ప్రముఖ పుణ్య క్షేత్రంగా పేరుగాంచిన ప్రసన్నాంజనేయ, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తిరునాళ్ల సందర్భంగా ఈ నెల 14వ తేదీ ఉదయం 5 గంటల నుంచి ప్రతి నిమిషానికి ఒక ప్రత్యేక బస్సు డిపో నుంచి నడపనున్నారు. ఈమేరకు డిపో మేనేజర్ బి. మోహనరావు బుధవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. రాష్ట్ర నలుమూలల నుంచి తిరునాళ్లకు వచ్చే భక్తులు ఈ సౌకార్యన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఒక్కో టికెట్ రూ.10 మాత్రమేనని తెలిపారు.
శింగరకొండ తిరునాళ్ల ప్రారంభం