
పూర్తిగా దగ్దమైన సూపర్ మార్కెట్
నరసరావుపేట రూరల్: చిలకలూరిపేట రోడ్డులోని ఛరిష్మా సూపర్ మార్కెట్ గిడ్డంగిలో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. రూ.3 కోట్లకుపైగా ఆస్తినష్టం వాటిల్లినట్టు వ్యాపారి తెలిపారు. నరసరావుపేట, చిలకలూరిపేట, సత్తెనపల్లి నుంచి వచ్చిన అగ్నిమాపక వాహనాలతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఛరిష్మా సూపర్ మార్కెట్ పేరుతో ఐదు శాఖలు నడుస్తున్నాయి. పట్టణంతోపాటు చిలకలూరిపేట, సత్తెనపల్లి, ఫిరంగిపురంలో బ్రాంచీలు ఉన్నాయి. చిలకలూరిపేట రోడ్డులోని ప్రధాన గిడ్డంగి నుంచి శాఖలకు నిత్యావసర సరుకులు సరఫరా చేస్తుంటారు. సోమవారం తెల్లవారుజామున ఈ గిడ్డంగి నుంచి పొగ బయటకు రావడంతో సెక్యూరిటీ సిబ్బంది గమనించి అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేసింది. గిడ్డంగిలో నిల్వలు ఉండటంతోపాటు మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో చిలకలూరిపేట, సత్తెనపల్లి నుంచి అదనపు అగ్నిమాపక శకటాలను రప్పించి మంటలను అదుపు చేశారు. ఫైర్ ఆఫీసర్ ఎంవీ సుబ్బారావు ఆధ్వర్యంలో సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు కృషిచేశారు.
కారణం అర్థం కావట్లేదు
అగ్నిప్రమాదం ఎలా జరిగిందో అర్థం కావడం లేదని ఛరిష్మా సూపర్ మార్కెట్ మేనేజింగ్ డైరెక్టర్ ఏలూరి నాగేశ్వరరావు తెలిపారు. భద్రత పరంగా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నామని, ప్రమాదంలో ఎలా జరిగిందో తెలియట్లేదని, దాదాపు రూ.3 కోట్లకు పైగా ఆస్తినష్టం జరిగిందని వివరించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నట్టు ఫైర్ ఆఫీసర్ ఎంవీ సుబ్బారావు తెలిపారు. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదంపై సూపర్ మార్కెట్ నిర్వాహకుడు నాగేశ్వరరావును వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వెంట తహసీల్దార్ రమణానాయక్, వైఎస్సార్ సీపీ నాయకులు ఉన్నారు.
రూ.3 కోట్లకుపైగా ఆస్తినష్టం!
Comments
Please login to add a commentAdd a comment