నారసింహ మహాదేవిగా బగళాముఖి అమ్మవారు
చందోలు(కర్లపాలెం): మార్గశిర అమావాస్య శుక్రవారం బాపట్ల జిల్లా చందోలులోని బగళాముఖి అమ్మవారు శ్రీ నారసింహ మహాదేవిగా పూజలందుకున్నారు. అమావాస్య సందర్భంగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఈవో నరసింహమూర్తి ఆధ్వర్యంలో వేద పండితులు శాంతి హోమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి వచ్చి బగళాముఖి అమ్మవారికి పూజలు చేశారు.
గుంటూరు రూరల్: గుంటూరు నగర శివారు లాంఫాంలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో శుక్రవారం బిల్డింగ్ ఆన్ ఏఐ యూనివర్సిటీ–ఏఐ ఫర్ అగ్రికల్చర్ అనే అంశంపై చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. యూఎస్‌ఏలోని ఫ్లోరిడా గ్లోబల్ ఫుడ్ స్టెంప్స్ ఇనిస్టిట్యూట్ యూనివర్సిటీ రీసెర్చ్ అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ కాకాని గోపాల్ ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఫ్లోరిడా, భారతదేశం వాతావరణ పరిస్థితులు ఒకే విధంగా ఉండటం వల్ల కృత్రిమ మేధస్సుపై చేసిన పరిశోధనలు ఆంధ్రప్రదేశ్‌లో పరిశీలించి ఆచరణలో పెట్టవచ్చన్నారు. యూనివర్సిటీ ఆఫ్ ఫ్ల్లోరిడా సూపర్ కంప్యూటర్ కలిగి ఉండటం వల్ల కృత్రిమ మేధస్సుపై ప్రపంచానికి నాయకత్వం వహిస్తుందన్నారు. కృత్రిమ మేధస్సు ద్వారా పంటల్లో కలుపు మొక్కలను, పురుగులను గుర్తించి వాటిపైన మాత్రమే రసాయనాలు పిచికారి చేసే పరిజ్ఞానం అక్కడ ఉందన్నారు. ఈ కార్యక్రమంలో లాంఫాం రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ పీవీ సత్యనారాయణ, ఇంజినీరింగ్ టెక్నాలజీ డాక్టర్ ఎ.మణి, పీజీ స్టడీస్ డీన్ డాక్టర్ ఏవీ రమణ, కంట్రోలర్ డాక్టర్ ప్రసాద్, కమ్యూనిటీ సైన్స్ డీన్ డాక్టర్ పి.సాంబశివరావు, ఎస్టేట్ ఆఫీసర్ పి. రవి, లైబ్రేరియన్ డాక్టర్ జి.కరుణ తదితరులు పాల్గొన్నారు.
గుంటూరు ఎడ్యుకేషన్: ఉద్యాన పంటల సాగు దిశగా రైతులను ప్రోత్సహించాలని ఉద్యాన శాఖ డైరెక్టర్ డాక్టర్ కె.శ్రీనివాసులు పేర్కొన్నారు. శుక్రవారం జెడ్పీ సమావేశ మందిరంలో ఉద్యాన పంటలపై అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. రైతు సేవ కేంద్రాల వారీగా రబీ 2025, ఖరీఫ్ 2026, రబీ 2026 సీజన్లకు సంబంధించిన పంట ప్రణాళికలను సిద్ధం చేసే విధానాలపై చర్చించారు. స్థూల విలువ జోడింపునకు సంబంధించిన వివిధ అంశాలపై సమీక్షించారు. ఈ సమావేశంలో ఉద్యాన శాఖ అదనపు డైరెక్టర్ ఎం. వెంకటేశ్వరరావు, ఉద్యానశాఖ ఏడీలు హరి నాథరెడ్డి, ఎం.అశోక్‌కుమార్ పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నారసింహ మహాదేవిగా బగళాముఖి అమ్మవారు


