103 ఏళ్ల పురాతన చరిత్ర

103 Years Old History For Vetapalem Library - Sakshi

వేటపాలెం(ప్రకాశం): 103 పురాతన చరిత్ర కల్గిన విజ్ఞాన భాండాగారంగా వేటపాలెం సారస్వత నికేతన్‌ గంథాలయం గుర్తింపు పొందింది. పాతతరంలో ఎందరినో విజ్ఞాన వంతులుగా తీర్చిదిద్ధిన ఘనత సారస్వత నికేతన్‌కు ఉంది. 103 ఏళ్ల కిందట స్థాపించబడిన గ్రంథాలయం రాష్ట్రంలోనే ఖ్యాతి గడించింది. 


గ్రంథాలయంలో ఉన్న గాంధీజీ చేతి కర్ర

గ్రంథాలయం ఆవిర్భావం..
1918 అక్టోబర్‌ 15న విజయదశమి నాడు గ్రామంలో అభ్యుదయ బావాలు కల యువకులు, ప్రజానేత ఊటుకూరి వెంకట సుబ్బారావు శేష్టి ప్రోత్సా హంతో కొందరు హిందూ యువజన సంఘం పేరుతో గ్రంథాలయాన్ని నెలకొల్పారు. 1923వ సంవత్సరంలో గ్రామం మధ్యలో పెంకుటింటిలో మార్చి అక్కడ కొనసాగించారు. 1924లో నూతన భవనం నిర్మించి గ్రంథాలయాన్ని మార్పు చేశారు. 1929 ఏప్రిల్‌ 18 తేదీన మహాత్మాగాంధీ గ్రంథాలయం నూతన భవనానికి శంకు స్థాపన చేశారు. ఆ సమయంలో గాంధీజీ చేతికర్రను గ్రంథాలయంలో వదిలివెళ్లారు. నేటీకి అది భద్రంగా ఉంది. 


1923లో పెంకుటింటిలో ఉన్న గ్రంథాలయం

అమూల్యగ్రంథాలు..
రాష్ట్రంలో నెలకొల్పిన గ్రంథాలయాల్లో ఉత్తమ గ్రంథ సేకరణ, గ్రంథాల ను భద్రపరచడంలో సారస్వత నికేతనం ప్రథమస్థానంలో నిలిచింది. తెలుగులో ముద్రణ ప్రారంభమైన నాటి నుంచి వెలువడిన ఉత్తమ గ్రంథాలలో చాలావరకు తొలి, తుది పుటలతో సహా భద్రపరచబడి ఉన్నాయి. దాదాపు లక్ష పుస్తకాలు ఇక్కడ ఉండగా అందులో 50 వేలు తెలుగు గ్రంథాలు, సంస్కృత గ్రంథాలు, 28 వేల ఇంగ్లీషు గ్రంథాలు, రెండు వేలు హిందీ గంథాలు, వెయ్యి ఉర్దూ తదితర గ్రంథాలు ఉన్నా యి. పత్రికల్ని భద్రపరచటంలో కూడా గ్రంథాలయానికి సమున్నత స్థానం ఉంది. 1942 నుంచి ఆంధ్ర పత్రిక, ఆంధ్రప్రభ కొత్తగా ప్రారంభమైన నాటి నుండి నేటి వరకు దినపత్రికలు సంపుటలుగా భద్రపరచడం జరిగింది. 


గ్రంథాలయంలోని విజిటర్స్‌ పుస్తకంలో మహాత్మాగాంధీజీ స్వహస్తాలతో రాసిన ఒపీనీయన్‌ 

పరిశోధనా కేంద్రం..
తెలుగు భాషా సాహిత్యాలపై పరిశోధన చేసేవారికి సమాచారం అంతా అందుబాటులో ఉంటుంది. శాస్త్ర పరిశోధకులకు ముఖ్యంగా సాహిత్య పరిశోధకులకు బాగా తోడ్పడుతూ వస్తుంది. దేవ వ్యాప్తంగా ఉన్న వివి« ద విశ్వవిద్యాలయాల్లోని పరిశోధకులు సారస్వత నికేతనానికి వచ్చి విష యసేకరణ చేస్తుంటారు. వేటపాలెంలోని సారస్వత నికేతనం గ్రంథాల యాన్ని ఎందరో పండితులు, ఉన్నత అధికారులు, రాజకీయ నాయకులు తరచూ సందర్శించి వెళుతుంటారు. 

నేటికీ తగ్గని ఆదరణ..
ప్రసార మాధ్యమాలు, ఇంటర్‌ నెట్‌ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చిన ఈనాటికీ గ్రంథాలయానికి వచ్చే వారి సంఖ్య తగ్గలేదు. ప్రధా నంగా సివిల్స్‌ గ్రూప్‌ పోటీ పరీక్షలకు సిద్దమయ్యే అభ్యర్థులు, గ్రంథాల యంలో గ్రంథ సేకరణ చేస్తుంటారు. పీహెచ్‌డీ చేసేవారు ఎక్కువగా ఇక్కడకు వచ్చి విలువైన పుస్తకాలను పరిశీలిస్తుంటారు. రాష్ట్రంలో వేటపాలెం సారస్వత నికేతనం గ్రంథాలయాన్ని వైఎస్సార్‌  లైఫ్‌టైం ఎచీవ్‌ మెంట్‌కి ఎంపికచేశారు. 
 

Read latest AP Special News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top