కడప నగరం రెండుగా..
సాక్షి ప్రతినిధి, కడప: రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన అంశం మళ్ళీ తెరపైకి రావడంతో ఉమ్మడి కడప జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు, అసెంబ్లీ స్థానాల సంఖ్యను అన్ని రాష్ట్రాల్లో 50 శాతం పెంచేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఒక్కో నియోజకవర్గానికి కనీసం 1.60 లక్షల ఓటర్లు తగ్గకుండా పునర్విభజన చేపట్టాలనే నిర్ణయం కారణంగా ఉమ్మడి కడప జిల్లాలో అదనంగా 4 అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.
ఓట్ల లెక్కలివే..
ప్రస్తుత ఓటర్ల సంఖ్యను ప్రాతిపదికగా తీసుకుంటే జిల్లాలో భారీ మార్పులు సంభవించనున్నాయి.
కడప లోక్‌సభ పరిధి: ఈ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 16,39,066 ఓట్లు ఉన్నాయి. 1.60 లక్షల ఓట్ల నిబంధన ప్రకారం ఇక్కడ మరో 3 అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశముంది.
కొత్త కేంద్రాలుగా పోరుమామిళ్ల, యర్రగుంట్ల?
ప్రాంతాలు మరియు ఓటర్ల లభ్యతను బట్టి మరికొన్ని కొత్త స్థానాలపై ఊహాగానాలు మొదలయ్యాయి. ప్రధానంగా పోరుమామిళ్ల కేంద్రంగా ఒకటి, యర్రగుంట్ల కేంద్రంగా మరొక కొత్త నియోజకవర్గం ఏర్పడే చాన్స్ ఉంది.
రాజంపేట లోక్‌సభ పరిధి: ఈ పార్లమెంటు పరిధిలో మొత్తం 16,65,702 ఓట్లు ఉండగా, ఇక్కడ కూడా మరో 3 స్థానాలు పెరగనున్నాయి. దీని ప్రకారం ఉమ్మడి కడప జిల్లాలో (రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు కలిపి) ఒక స్థానంతో పాటు, అన్నమయ్య జిల్లాలో మరో రెండు స్థానాలు పెరగనున్నాయి. ఈ క్రమంలో గతంలో రద్దయిన లక్కిరెడ్డిపల్లె తిరిగి నియోజకవర్గంగా అవతరించే అవకాశం ఉందని సమాచారం. తాజా మార్పుల వల్ల రెండు పార్లమెంటు స్థానాల పరిధిలో అదనంగా మరో ఎంపీ స్థానం కూడా జతయ్యే
అవకాశం ఉంది.
రాజకీయ ప్రేరిపితంగా కాకుండా, కేవలం ఓటర్ల సంఖ్య ఆధారంగా పునర్విభజన జరిగితే.. కడప–2, పోరుమామిళ్ల, యర్రగుంట్ల వంటి కొత్త స్థానాలు ఖాయమని విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు. సీట్ల పెంపు నిర్ణయం జిల్లాలోని ద్వితీయ శ్రేణి నేతలకు, రాజకీయ నిరుద్యోగులకు పెద్ద వరంగా మారనుంది. 33 శాతం మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలంటే సీట్ల సంఖ్యను పెంచడం ద్వారా పురుష అభ్యర్థులకు ఇబ్బంది లేకుండా సర్దుబాటు చేయవచ్చని కేంద్రం భావిస్తోంది. నియోజకవర్గాల సంఖ్య పెరిగితే ఇన్నాళ్లూ అవకాశం కోసం ఎదురుచూస్తున్న ప్రధాన పార్టీల ద్వితీయ శ్రేణి నేతలకు అసెంబ్లీ మెట్లు ఎక్కే అదృష్టం దక్కనుంది. వెరసి, రాబోయే పునర్విభజన జిల్లా రాజకీయ చిత్రపటాన్నే మార్చివేయనుంది.
ఈ పునర్విభజనలో నియోజకవర్గాల సరిహద్దు రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. సగటున నాలుగు లేదా ఐదు మండలాలను కలిపి ఒక నియోజకవర్గంగా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా కడప అసెంబ్లీ నియోజకవర్గంలో ఉండాల్సిన దానికంటే సుమారు 1.20 లక్షల ఓట్లు అదనంగా ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. దీనివల్ల కడపను ఈస్ట్, వెస్ట్ నియోజకవర్గాలుగా విభజించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలుస్తోంది.
కడప అసెంబ్లీ సీట్ల కోటా పెరగనుంది
పునర్విభజనతో ఉమ్మడి జిల్లాలో మరో 4 అసెంబ్లీ స్థానాలు
నియోజకవర్గానికి 1.60 లక్షల ఓటర్లప్రాతిపదికన పునర్విభజన
కడప ఈస్ట్, వెస్ట్‌గా జిల్లా కేంద్రం విభజన
ద్వితీయ శ్రేణి నేతలు, రాజకీయ నిరుద్యోగులకు వరించనున్న అదృష్టం


