చీతా అంటూ వదంతులు
బి.కొత్తకోట: బి.కొత్తకోట సమీపంలో గురువారం చితా కనిపించిందని, సమీప జనుపవారిపల్లె గుట్టలోకి వెళ్లిందని విస్త్రృత ప్రచారం జరిగింది. దీంతో పట్టణంలో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఈ విషయాన్ని అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆరా తీయగా అదంతా మార్ఫింగ్ ఫొటోతో వదంతులు సృష్టించారని స్పష్టమైంది. దేశంలో చీతాలు లేవని అలాంటప్పుడు ఇక్కడ ఎలా ఉంటుందని అటవీశాఖ సెక్షన్ ఆఫీసర్ అడపా శివకుమార్ స్పష్టం చేశారు.
తంబళ్లపల్లె: మహిళా సంఘాల్లోని సభ్యులు ఆర్థికాభివృద్ధి సాధించే విధంగా సంఘమిత్రలు, సీసీలు కృషి చేయాలని వెలుగు ప్రాజెక్టు డైరెక్టర్ నాగేశ్వరరావు తెలిపారు. గురువారం వెలుగు కార్యాలయంలో తంబళ్లపల్లె,పెద్దమండ్యం, కురబలకోట మండలాల సంఘమిత్రలతో సమావేశం నిర్వహించారు. ప్రతి మహిళా సభ్యురాలు బ్యాంకు పథకాల ద్వారా అందే ఆర్థిక సహకారంతో అభివృద్ధి చెందినప్పుడే వారి జీవనప్రమాణాలు పెరుగుతాయన్నారు. అర్హత కలిగిన సంఘాలన్నింటికీ బ్యాంకు రుణాలు పంపిణీ చేసే విధంగా చొరవ చూపాలన్నారు. కార్యక్రమంలో ఏపిఎంలు గంగాధర్, నరసింహులు, శ్రీనివాసులు, డైరీ ఏపీఎం సుజాత పాల్గొన్నారు.
రాయచోటి: రాయచోటిలోని డైట్ ప్రభుత్వ ఉన్న పాఠశాలలో ఈనెల 20న నిర్వహించనున్న జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్‌ను విజయవంతం చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి సుబ్రమణ్యం ప్రధానోపాధ్యాయులకు సూచించారు. గురువారం ఇక్కడ ఆయన మాట్లాడుతూ వికసిత్, ఆత్మ నిర్భర్ భారత్ కోసం స్టెమ్ అనే ప్రదాన ఇతివృత్తం ఆధారంగా పాఠశాల స్థాయి నుంచి జాతీయస్థాయి వరకు విద్యార్థులకు సైన్స్ ఫెయిర్‌లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు ఆదేశాల మేరకు ఈనెల 16న పాఠశాల, 18న మండలస్థాయిలో సైన్స్ ఫెయిర్‌లు నిర్వహించామన్నారు. ఈనెల 20న రాయచోటిలోని డైట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్న జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్‌లో మండలస్థాయి విజేతలు పాల్గొని తమ ప్రాజెక్టులను ప్రదర్శించాలన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం య్యేలా ప్రదానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారులు చొరవ చూపాలన్నారు. జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్ నుంచి 11 ప్రాజెక్టులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేయనున్నట్లు చెప్పారు.
కడప ఎడ్యుకేషన్: స్కూల్ గేమ్స్ అండర్ 14 జాతీయస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ పోస్టర్‌ను గురువారం స్కూల్ గేమ్స్ రాష్ట్ర కార్యదర్శి భానుమూర్తి రాజు ఆవిష్కరించారు. జనవరి 5 నుంచి 9వ తేదీ వరకు జమ్మలమడుగులోని బాలికల ప్రభుత్వ కళాశాలలో ఈ పోటీలు జరగనున్నాయి. ఈ మేరకు గురువారం స్కూల్ గేమ్స్ రాష్ట్ర కార్యదర్శి భానుమూర్తి రాజు క్రీడా ప్రాంగణాన్ని సందర్శించి జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శులకు పలు సూచనలు అందించారు.
బి.కొత్తకోట: బి.కొత్తకోట మండలం పరిషత్ అధ్యక్షురాలిగా ఎన్.రాధ గురువారం బాధ్యతలను చేపట్టారు. ఎంపీపీగా ఉన్న లక్ష్మీనరసమ్మ వచ్చే మార్చి 13 వరకు సెలవులో వెళ్లడంతో ఆ స్థానంలో వైస్‌ఎంపీపీగా ఉన్న రాధను ఎన్నుకునేందుకు ప్రతిపాదించగా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. దీనిపై మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీలతో సమావేశం నిర్వహించగా వైస్‌ఎంపీపి ఖాదర్‌వలీ, ఎంపీటీసీలు గౌతమి, రామసుబ్బారెడ్డి, ఈశ్వరమ్మ, రమాదేవి, యల్లప్ప, విమలమ్మ, బాలకృష్ణలు హజరయ్యారు. అనంతరం ఎంపీడీఓ అబ్దుల్ షుకూర్ ఎంపీపీగా రాధకు బాధ్యతలను అప్పగిస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా రాధ మాట్లాడుతూ తనను ఎంపీపీగా ఎంపిక చేసిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, ఎన్నుకున్న ఎంపీటీసీలకు కృతజ్ఞతలు తెలిపారు. మండలాభివృద్దికి ఎమ్మెల్యే, ఎంపిటిసి సలహాలు, సూచనలతో కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమానికి హజరైన వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీపీ ఖలీల్, మండల కన్వీనర్ ప్రదీప్‌రెడ్డి, జెడ్పీటిసి రామచంద్ర, పద్మశాలి కార్పోరేషన్ మాజీ డైరెక్టర్ సురేంద్రనాధ్‌లు రాధను సత్కరించారు.


