రైళ్ల ద్వారా టమాట ఎగుమతులు
మదనపల్లె: మదనపల్లె నుంచి టమాటను రైళ్ల ద్వారా వివిధ ప్రాంతాలకు ఎగుమతులు చేసేలా రైల్వేశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు మార్కెటింగ్‌శాఖ అధికారులు వెల్లడించారు. గురువారం స్థానిక మార్కెట్ యార్డులో మార్కెట్ కమిటీ పాలకవర్గ సమావేశం చైర్మన్ శివరాం అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్, కార్యదర్శి జగదీష్ పలు అంశాలను కమిటీ దృష్టికి తెచ్చారు. పలుఅంశాలపై తీర్మానం చేశాక వారు మాట్లాడుతూ మదనపల్లె రోడ్ రైల్వే స్టేషన్ నుంచి ఏపీ, తమిళనాడులోని వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తే మంచి ధరలు పలికి రైతులకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. ఈ అవకాశాన్ని పరిశీలించి సహకారించాలని రైల్వే అధికారులను కోరినట్టు చెప్పారు. దీనికోసం ప్రత్యేక గూడ్స్ రైలును కేటాయిస్తే అధిక ఎగుమతులు సాధ్యమవుతుందని చెప్పారు. వచ్చే జనవరి 26 నుంచి మార్కెట్‌లో 30 కిలోలకు బదులు 15 కిలోల క్రేట్లతో టమాట కొనుగొలు జరగాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఈ విధానం ఖచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకుంటామని, వ్యాపారులు సహకరించాలని కోరారు. రైతుల కోసం మార్కెట్‌లో ఆర్వో ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు తీర్మాణం చేసినట్టు చెప్పారు. సమావేశంలో కమిటి డైరెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
మార్కెట్ కమిటీ నిర్ణయం


