పింఛన్‌దారులతో డీఎల్‌పీవో విచారణ
పెద్దతిప్పసముద్రం: మండలంలోని కాట్నగల్లు పంచాయతీ మద్దిరెడ్డిపల్లిలోని నెలవారి పింఛన్‌దారులకు ప్రభుత్వం ద్వారా మంజూరైన సొమ్ము నుంచి కార్యదర్శి ఇంటి పన్ను వసూలు చేశాడని బాధితులు ఆరోపించారు. అంతేగాక తమ వద్ద రూ.1,000ల నుంచి రూ,1,800ల వరకు పన్నుల రూపంలో వసూలు చేసినా ఇంత వరకు ఆన్‌లైన్ రశీదు కాకుండా మ్యానువల్ రశీదు ఇచ్చారని బాధితులు ఆవేదన వ్యక్తం చేసారు. ఈ విషయంపై సాక్షి పత్రికలో గురువారం ‘పింఛన్ డబ్బుల్లో ఇంటి పన్ను కోత’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీనిపై జిల్లా అధికారులు స్పందించారు. కలెక్టర్, డీపీవో ఆదేశాల మేరకు మదనపల్లె డీఎల్‌పీవో నాగరాజు, ఎంపీడీవో ప్రతాప్‌రెడ్డితో కలసి కాట్నగల్లు సచివాలయానికి విచ్చేసి రికార్డులు తనిఖీ చేశారు. అనంతరం బాధిత పింఛన్‌దారులతో విచారించారు. పింఛన్ సొమ్ము నుంచి పన్నులు ఎందుకు వసూలు చేశావు.. సదరు సొమ్ము ప్రభుత్వ ఖజానాకు జమ చేశావా,వసూలు చేసిన పన్నులకు సంభంధించి లబ్ధిదారులకు మ్యానువల్ రశీదు ఎలా ఇస్తావు అంటూ పంచాయతీ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై డీఎల్‌పీవో మాట్లాడుతూ రికార్డులు, ఆన్‌లైన్ వివరాలను సమగ్రంగా తనిఖీ చేసి తదుపరి చర్యల నిమిత్తం నివేదికను జిల్లా కలెక్టర్‌కు అందజేస్తామని వెల్లడించారు.
పింఛన్‌దారులతో డీఎల్‌పీవో విచారణ


