అధికారమే దన్ను.. ఈద్గా భూమిపై కన్ను
● రెండు ఎకరాలు యథేచ్ఛగా కబ్జా
● మైనార్టీల భూములు అన్యాక్రాంతం
● అక్రమంగా కంచె ఏర్పాటు
● పట్టించుకోని రెవెన్యూ అధికారులు
సాక్షి టాస్క్‌ఫోర్స్ : రైల్వేకోడూరు మండల పరిధి మైసూరువారిపల్లి గ్రామ సమీపంలో ముస్లిం మైనార్టీలకు చెందిన ఈద్గా స్థలాన్ని.. అదే గ్రామానికి చెందిన జనసేన నాయకుడు దర్జాగా కబ్జా చేస్తున్నాడు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. రాష్ట్రంలో కూటమి పార్టీల నాయకులు ఇష్టారాజ్యంగా కబ్జాలకు పాల్పడుతున్నారు. ముస్లిం మైనార్టీలకు ఇచ్చిన భూమిని కూడా అన్యాక్రాంతం చేస్తున్నారు.
జగనన్న హయాంలో ఈద్గాకు కేటాయింపు
రైల్వేకోడూరు పట్టణంలోని ముస్లింలు.. దశాబ్దాలుగా ఈద్గా స్థలం లేక అగచాట్లు పడుతూ వచ్చారు. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నప్పుడు.. ఈద్గా కోసం నాలుగు ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ముస్లింలందరూ కలిసి అనేక సార్లు ఎంపీ మిథున్‌రెడ్డికి విన్నవించుకోగా మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు సహకారంతో.. మైసూరువారిపల్లి సర్వే నంబర్ 2085/4లో ప్రభుత్వ భూమిని ఈద్గాకు రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వడం జరిగింది. పట్టణంలోని ముస్లింలు అందరూ పార్టీలకు అతీతంగా హర్షం వ్యక్తం చేశారు.
ఈద్గా నిర్మాణం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఈద్గా స్థలాన్ని ముస్లింలు చదును చేసుకొని ఈద్గా నిర్మాణం చేపట్టారు. ఈ ఏడాది రంజాన్, బక్రీద్ పండుగలను ఈద్గా ప్రాంతంలో రైల్వేకోడూరు పట్టణ ముస్లింలందరూ కలిసి జరుపుకొన్నారు. అక్కడ నమాజులు ఆచరించారు.
అధికారులు అడ్డుకోవాలి
ఈద్గా భూమిలో దాదాపు రెండు ఎకరాలకు గ్రామానికి చెందిన జనసేన పార్టీ నాయకుడు అక్రమంగా ముళ్ల కంచెను ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. తెలుగుదే శం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కూటమి నాయకులకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. కబ్జాలను అడ్డుకోవాల్సిన రెవెన్యూ అధికారులు ఏమీచేయలేక చేతులెత్తేశారు. ఇప్పటికై నా జిల్లా కలెక్టర్, ఉన్నత స్థాయి, రెవెన్యూ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి కబ్జాను అడ్డుకోవాలని రైల్వేకోడూరు పట్టణ ముస్లింలు కోరుతున్నారు.
అధికారమే దన్ను.. ఈద్గా భూమిపై కన్ను


