 
															బాలికల అదృశ్యం
గాలివీడు : మండలంలోని అరవీడు గ్రామానికి చెందిన ఇద్దరు బాలికలు అదశ్యమవడం చర్చనీయాంశంగా మారింది. ఎస్‌ఐ రామకృష్ణ కథనం మేరకు.. జుబేదా (15), జాస్మిన్(13) గాండ్లపల్లి హైస్కూల్‌లో ఎనిమిదో తరగతి చదువుతున్నారు. ఈ నెల 29వ తేదీ బుధవారం ఉదయం స్కూలుకెళ్తామని ఇంటి నుంచి బయలుదేరిన వీరు.. ఆ తర్వాత ఇంటికి తిరిగి రాలేదు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో గాలివీడు పోలీసులు కేసు నమోదు చేశారు. క్రైమ్ నం.130/2025గా గర్ల్ మిస్సింగ్ కేసుగా దర్యాప్తు కొనసాగుతోంది.
మహిళ ఆత్మహత్యాయత్నం
మదనపల్లె రూరల్ : రుణం చెల్లించాలనే ఒత్తిడి భరించలేక ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మదనపల్లె మండలంలో గురువారం జరిగింది. ఇసుకనూతనపల్లెకు చెందిన ప్రభావతి (42) కుటుంబ అవసరాల నిమిత్తం స్థానికంగా ఓ వ్యక్తి దగ్గర కొంత నగదు అప్పు చేసింది. అయితే అనుకున్న సమయానికి రుణం చెల్లించలేకపోయింది. దీంతో రుణదాత ఒత్తిడి చేయడంతో మనస్తాపం చెంది పురుగుమందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు బాధితురాలిని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. సంబంధిత పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
యువకుడికి తీవ్రగాయాలు
ములకలచెరువు : మిద్దె మెట్లపై నుంచి ప్రమాదవశాత్తూ జారిపడి యువకుడికి తీవ్రగాయాలైన సంఘటన మండలంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు... మండలం లో ని చౌడసముద్రానికి చెందిన కె.శేషాద్రి(21) మిద్దె మెట్లు దిగుతుండగా కాలుజారి కింద పడ్డారు. బాధితుడిని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వివాహిత ఆత్మహత్య
పీలేరు రూరల్ : పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన పీలేరు పట్టణం మోడల్ కాలనీలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా వున్నాయి. మోడల్ కాలనీకి చెందిన త్రివేణి (25)కి ఏడేళ్ల క్రితం కేవీపల్లె మండలం గోరంట్లపల్లెకు చెందిన సుబ్రహ్మణ్యంతో వివాహమైంది. గత కొంత కాలంగా తన ఇద్దరి పిల్లలతో త్రివేణి స్థానిక మోడల్ కాలనీలో తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం త్రివేణి పురుగుల మందు తాగి ఇంటిలో పడుకుంది. ఆమె నోట్లో నుంచి నురుగు రావడం గమనించి కుటుంబ సభ్యులు చికిత్సనిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
బంగారు నగల చోరీపై
కేసు నమోదు
ఒంటిమిట్ట : మండలంలోని సాలాబాద్ గ్రామంలో గత నెల 25న జరిగిన చోరీపై గురువారం కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల మేరకు..సాలాబాద్ గ్రామంలోని లంకా వెంకటలక్ష్మమ్మ గత నెల 25న పొలం పనులకు వెళ్లారు. ఇంటికి తిరిగి వచ్చి చూసేసరికి బీరువాలో నాలుగు తులాల బంగారు ఆభరణాలు చోరీ అయినట్లు గుర్తించారు. ఆలస్యంగానైనా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
 
							బాలికల అదృశ్యం

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
