 
															ఆ ఎంపీపీ మాకు వద్దు
బి.కొత్తకోట : బి.కొత్తకోట ఎంపీపీ లక్ష్మీ నరసమ్మను పదవి నుంచి తొలగించాలని తాము నిర్ణయించామని మండలానికి చెందిన పదిమంది వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలు మదనపల్లె సబ్ కలెక్టర్ చల్లా కల్యాణికి అవిశ్వాస నోటీసు అందజేశారు. దీంతో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి పదవీచ్యుతురాలిని చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. 2021లో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో మండలంలోని 11 మంది ఎంపీటీసీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ ఎంపీపీలు వి.ఖాదర్‌వలి, ఎన్.రాధ, ఎంపీఈసీ సభ్యులు వి.రామసుబ్బారెడ్డి, సి.విమలమ్మ, సి.యల్లప్ప, ఎ.సుబ్బయ్య, ఎ.గౌతమి, బి.ఈశ్వరమ్మ, ఎ.బాలకృష్ణ, ఎ.రమాదేవి కలిసి ఎంపీపీ లక్ష్మీ నరసమ్మను వ్యతిరేకిస్తున్నారు. అవిశ్వాస నోటీసులో అందుకు సంబంధించి కారణాలు వెల్లడించారు. నియంతృత్వ పోకడతో వ్యవహరిస్తూ అభివృద్ది పనుల ప్రతిపాదనలను ఖాతర చేయకుండా ఎంపీపీ వ్యవహరిస్తున్నారని, పనులకు అటంకం కలిగేలా ప్రవర్తిస్తున్నారని వారు పేర్కొన్నారు. ఈ ఏడాది మొదట్లోనూ అవిశ్వాస నోటీసు ఇవ్వగా అందుకు కాల పరిమితి సరిపోదని అధికారులు పక్కనపెట్టారని తెలిపారు. ప్రస్తుతం అవిశ్వాసం ప్రకటించి ఎంపీపీని పదవి నుంచి తొలగించేందకు నోటీసు ఇచ్చామని అధికారులు దానిని పరిగణలోకి తీసుకున్నారని వివరించారు. గుమ్మసముద్రం ఎంపీటీసీగ స్థానం ఎస్సీలకు రిజర్వు చేయడంతో లక్ష్మీ నరసమ్మను అనూహ్యంగా ఎంపీపీగా ఎన్నుకున్నారు. తమ గ్రామాలలో చిన్నచిన్న అభివృద్ది పనులు కూడా ఆమె చేపట్టలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
12న అవిశ్వాసం : బి.కొత్తకోట ఎంపీపీ లక్ష్మినరసమ్మపై నవంబర్ 12న స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో అవిశ్వాసం తీర్మానం పెట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. సంబంధించిన నోటీసులను గురువారం అధికారులు జారీ చేయనున్నారు. ఆ తర్వాత నిర్వహించే సమావేశానికి ఎంపీటీసీలు హాజరుకావాల్సి ఉంటుంది. చర్చించిన తర్వాత అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి ఓటింగ్ నిర్వహిస్తారు. ఎంపీటీసీలు ఆమోదం తెలిపితే అదే రోజున ఎంపీపీ పదవి పోతుంది.
అవిశ్వాస నోటీసు సబ్ కలెక్టర్‌కు ఇచ్చిన
ఎంపీటీసీలు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
