 
															గంజాయి విక్రయిస్తున్న విద్యార్థుల అరెస్టు
మదనపల్లె రూరల్ : ఉన్నత స్థానాలకు చేరుకుని తల్లిదండ్రులకు అండగా నిలవాల్సిన విద్యార్థులు మద్యం, గంజాయి మత్తుకు అలవాటు పడి జీవితాలను చిత్తు చేసుకుంటున్నారని డీఎస్పీ మహేంద్ర తెలిపారు. గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు విద్యార్థులను అరెస్టు చేసినట్లు ఆయన వెల్లడించారు. డీఎస్పీ మహేంద్ర, వన్ టౌన్ సీఐ మహమ్మద్‌రఫీ వివరాల మేరకు.. కొన్ని రోజులుగా గంజాయి విక్రయాలపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. మంగళవారం సాయంత్రం వన్‌టౌన్ సీఐ మహమ్మద్‌రఫీ, సిబ్బందితో కలిసి నక్కలదిన్నె బీటీ కాలేజీ గ్రౌండ్‌లో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారన్నారు. వారిని విచారించగా కురబలకోట మండలం కసాయివీధికి చెందిన నజీర్ కుమారుడు మహమ్మద్‌అనీస్ (22)స్థానిక కాలేజీలో ఎంబీఏ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడని గంజాయి, మద్యం అలవాట్లకు లోనయ్యాడని తెలిపారన్నారు. తల్లిదండ్రులు ఇచ్చే పాకెట్‌మనీ విలాసాలకు సరికపోకపోవడంతో సులభంగా డబ్బు సంపాదనకై ఈ గంజాయి విక్రయాన్ని ఎంచుకున్నాడన్నారు. బసినికొండ పంచాయతీ పుంగనూరురోడ్డు అగ్గిపుల్లల ఫ్యాక్టరీ ప్రాంతానికి చెందిన వెంకటరమణ కుమారుడు దండు విజయకుమార్ ప్రస్తుతం చంద్రకాలనీ వాల్మీకి నగర్‌లో ఉంటూ పట్టణంలోని ఓ ప్రైవేటు కాలేజీలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడన్నారు. వీరిద్దరూ కలిసి సలభంగా డబ్బు సంపాదించేందుకు పట్టణానికి చెందిన జాఫర్ అలీ గంగిశెట్టి శివకుమార్ అనే గంజాయి రవాణాదారుల వద్ద నుంచి 5 కిలోలు కొనుగోలు చేసి చిన్నచిన్న ప్యాకెట్లుగా తయారు చేసి మదనపల్లెతో పాటు పరిసర ప్రాంతాల్లో యువత, విద్యార్థులకు గంజాయి విక్రయిస్తున్నారన్నారు. మంగళవారం సాయంత్రం జరిపిన దాడిలో నిందితులైన విద్యార్థులు పోలీసులకు పట్టుపడ్డారన్నారు. వారి వద్ద నుంచి 1.8 కిలోల గంజాయి, రెండు సెల్‌ఫోన్లు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులపై ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచామని పేర్కొన్నారు. కార్యక్రమంలో వన్ టౌన్ ఎస్.ఐ అన్సర్‌బాషా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
1.8 కిలోల గంజాయి, రెండు సెల్ ఫోన్లు, బైక్ స్వాధీనం

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
