 
															రాష్ట్ర స్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు ‘భారతి’ విద్యార్థ
కమలాపురం : కమలాపురం మండలం నల్లలింగాయపల్లెలో ఉన్న డీఏవీ భారతి స్కూల్‌కు చెందిన పదవ తరగతి విద్యార్థిని పి.వైశాలి రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపల్ శివ్వామ్ కిషోర్ కుమార్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 25వ తేదీ గండిలోని డాక్టర్ బీఆర్. అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో జరిగిన జిల్లా స్థాయి అండర్–17 హ్యాండ్ బాల్ పోటీల్లో పాల్గొన్న వైశాలి అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. బంగారు పతకం సాధించిన వైశాలి త్వరలో విజయవాడలో నిర్వహించే రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు హాజరవుతుందని ఆయన వివరించారు.
సిల్వర్ జోన్ ఫౌండేషన్ లిటిల్ స్టార్స్‌లో డీఏవీ విద్యార్థుల ప్రతిభ..
సిల్వర్ జోన్ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ లిటిల్ స్టార్‌లో ఇంగ్లీష్, గణితం, సైన్స్ ఒలంపియాడ్ (ఐఓఈఎల్) డీఏవీ విద్యార్థులు ప్రతిభ కనబరిచారని ప్రిన్సిపల్ కిషోర్ కుమార్ తెలిపారు. తమ డీఏవీ భారతి స్కూల్‌కు చెందిన 147 మంది విద్యార్థులకు బంగారు పతకాలు అందాయన్నారు. అలాగే ఐదుగురికి వెండి, ఏడుగురు రజత పతకాలు అందుకున్నారని తెలిపారు.
బాలుడిపై విచక్షణా రహితంగా దాడి
కడప అర్బన్ : కడప నగరం గంజికుంట కాలనీలో గుర్రాలషెడ్డు సమీపంలో 17 ఏళ్ల బాలుడిపై మేనమామ మరో వ్యక్తితో కలిసి విచక్షణ రహితంగా దాడి చేశారు. కడప నకాష్ ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు, మరో బాలుడితో కలిసి టీవీఎస్ వాహనాన్ని దొంగతనం చేశారు. ఈ క్రమంలో వచ్చిన డబ్బులను తీసుకొని ఇతర ప్రాంతాలకు వెళ్లి జల్సా చేసుకున్నారు. తరువాత వారిలో ఇద్దరు కడపకు రాగా, మరో బాలుడిని అలాగే వదిలేశారు. ఇద్దరు యువకులు వచ్చిన తర్వాత బాలుని బంధువులు ఆరా తీశారు. పోలీసులను ఆశ్రయించగా వారు ఇతర ప్రాంతంలో బాలుడు ఉన్నాడని తెలుసుకొని బంధువులు అక్కడికి వెళ్లి అతన్ని తీసుకుని వచ్చారు. తర్వాత తమ బాలుడు ఇంటి నుంచి వెళ్లడానికి కారణమైన బాలుడిపై దారుణంగా దాడి చేయడంతో ఆ సంఘటనను సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో కాస్త వైరల్‌గా మారింది. ఈ ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
