చెరువును చెరబట్టారు | - | Sakshi
Sakshi News home page

చెరువును చెరబట్టారు

Oct 28 2025 7:46 AM | Updated on Oct 28 2025 7:46 AM

చెరువ

చెరువును చెరబట్టారు

లక్కిరెడ్డిపల్లి : కరువు ప్రాంతమైన లక్కిరెడ్డిపల్లెలో చుక్కనీరు కూడా అమృతమే. అలాంటి ప్రాంతంలో చెరువులకు నీరు అందించే కాల్వలు ఎంతో ముఖ్యం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మండలంలో వారి అగడాలకు అంతే లేకుండా పోతోంది. ప్రభుత్వ భూమి కనిపిస్తే కబ్జా చేసేలా వారి ధోరణి ఉంటోంది. లక్కిరెడ్డిపల్లె మండలంలోని లక్కిరెడ్డిపల్లె టౌన్‌తోపాటు పలు గ్రామాలకు దొర్రిచెరువు కీలకం. ఈ చెరువు నిండితే తాగు, సాగునీటికి ఇబ్బంది ఉండదు. అలాంటి చెరువుపై కూటమి నాయకుల కన్ను పడింది. చెరువు భూమి ఆక్రమించుకుంటూ ఈ ప్రాంత రైతాంగాన్ని నిండా ముంచుతున్నారు. అలాగే కాల్వలను కూడా కబ్జా చేస్తున్నారు.

వైఎస్సార్‌ కల.. గడికోట చొరవ.. వెలిగల్లు

వెలిగల్లు ప్రాజెక్టు పునాదిరాయిని దివంగత మాజీ మంత్రి ఆర్‌.రాజగోపాల్‌ రెడ్డి శంకుస్థాపన చేసినా ప్రాజెక్టు నిర్మాణానికి సరిపడా నిధులు అప్పటి ప్రభుత్వం మంజూరు చేయలేదు. 2004లో అధికారం చేపట్టిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జలయజ్ఞంలో భాగంగా వెలిగల్లు ప్రాజక్టు నిర్మాణ పనులను అప్పటి ఎమ్మెల్యే గడికోట మోహన్‌ రెడ్డి ద్వారా పూర్తి చేయించారు. రైతులను ఆదుకోవాలనే సదుద్దేశంతో వెలిగల్లును నిర్మించారు. తరువాతి కాలంలో గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డిల కృషితో ప్రధాన కాల్వలను శరవేగంగా పూర్తయ్యాయి. 2019 తర్వాత వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్న సమయంలో ఎగువ ప్రాంతంలో మంచి వర్షాలు కురవడంతో ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 4.26 టీఎంసీలు చేరుకొని గేట్లు ద్వారా నీటిని వదిలారు. చాలా సంవత్సరాల తర్వాత ప్రాజెక్టు నిండుకుండను తలపించడంతో చివరి ఆయకట్టు అయిన దిన్నెపాడు పెద్దచెరువు, హసనాపురం పెద్దచెరువు వరకు వెలిగల్లు నీటిని నింపాలనే లక్ష్యంతో మరోసారి రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి, అప్పటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డిలు కాలువలలో పూడికతీత పనులు చేయించారు. ప్రతి చెరువును వెలిగల్లు నీటితో నింపారు. దీంతో రైతులు వరి, వేరుశనగ సాగుతోపాటు ఉద్యాన పంటలైన మామిడి, బొప్పాయి పంటలకు నీరు అందడంతో మంచి లాభాలు చూశారు. అయితే ప్రస్తుతం రెండేళ్లుగా ఈ ప్రాంతంలో వర్షాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు ఇటీవల కురుస్తున్న వానలతో వెలిగల్లుకు చేరిన వరద నీటిని చెరువులకు అందించాలని నిర్ణయించి కాలువలకు నీరు వదిలారు. ఇప్పటి వరకు కుర్నూతల, కస్తూరురాజుగారిపల్లి, పందిళ్లపల్లి, బూడిదగుంటపల్లి వరకు మాత్రమే కొన్ని ప్రాంతాల్లోని చెరువులకు నీరు చేరింది. బూడిదగుంటపల్లి నుంచి దొర్రిచెరువు మీదుగా బి.ఎర్రగుడి, దిన్నెపాడు, పెద్దచెరువు వరకు నీరు చేరాలంటే దొర్రిచెరువు వద్ద ప్రధాన కాలువ కింద భాగం పూర్తిగా మట్టిని తవ్వేసి కొంతమంది ఆక్రమించుకున్నారు. దొర్రిచెరువుకు వెలిగల్లు కాల్వ ద్వారా నీరు చేరితేనే దాదాపు అప్పకొండయ్యగారిపల్లి, లక్కిరెడ్డిపల్లి టౌన్‌, చింతలకుంట వాండ్లపల్లి, ఉత్తరమెట్టు దళితవాడ, గంగనపల్లి, గుడ్లవారిపల్లి ప్రాంతాల్లోని చెరువులకు నీరు చేరి సాగునీరుతో పాటు భూగర్భ జలాలు పెరిగి తాగునీటికి ఇబ్బంది ఉండదని ఆ ప్రాంత రైతులు చెబుతున్నారు. దొర్రిచెరువు నుంచి కోనంపేట గ్రామం కాలాడివాండ్లపల్లి, దిన్నెపాడు, కోమటివానిచెరువు మీదుగా దిన్నెపాడు పెద్దచెరువుకు వెలిగల్లు నీరు చేరితే వేల ఎకరాలకు సాగునీరుతో పాటు తాగునీటి ఇబ్బందులు ఉండవని ఆయా గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు.

ఆక్రమణల జోరు.. ప్రశ్నార్థకంగా నీరు

వెలిగల్లు కాలువ కింద భాగంలో అధికార పార్టీ నాయకుల అండతో కొందరు అక్రమార్కులు మట్టిని తవ్వేసి పొలాలుగా మార్చుకొని, నేషనల్‌ హైవేలో తమ పొలాలు పోతున్నాయంటూ తప్పుడు ధృవపత్రాలు సృష్టించి లక్షలాది రూపాలు సొమ్ము చేసుకున్నట్టు పలువురు ఆరోపిస్తున్నారు. లక్కిరెడ్డిపల్లి సర్వే నంబరు 47లో 39 ఎకరాలు పైబడి దొర్రిచెరువు భూమి ఉంది. చెరువు భూమిలో దాదాపు 10 ఎకరాలు..(ఎకరం రూ.20లక్షలు పైన ఉంటుంది) కొందరు వ్యక్తులు ఆక్రమించడమే కాక ఏకంగా మొక్కలను నాటారు. దీనిపై రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంపై రైతులు మండిపడ్డారు. కస్తూర్బా గాంధీ పాఠశాలకు వెళ్లే మార్గంలో గొల్లపల్లి చెరువుకు చేరే వంకను కూడా కొంతమంది ఆక్రమించుకొని మట్టిని తోలుతున్నారు. గంగమ్మ జాతరకు వెళ్లే రోడ్డు మార్గం పక్కనే ఇలా వంకలు ఆక్రమణకు గురవుతున్నా లక్కిరెడ్డిపల్లి రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్‌ యంత్రాంగం చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండటంపై ఆయకట్టు రైతులు పెదవి విరుస్తున్నారు. కాగా కూటమి నేతలు ఎలాంటి అనుమతులు లేకుండా ఎర్రమట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నా మామూళ్లకు అలవాటుపడిన రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదనే వాదన పలువురు రైతుల నుంచి వినిపిస్తోంది. దీంతో లక్షలాది రూపాయలు ప్రభుత్వ ఖజానాకు గండి పడుతున్నట్టు మండల ప్రజలు చెబుతున్నారు.

కస్తూర్భాగాంధీ పాఠశాల సమీపంలో వంకను ఆక్రమించి జేసీబీ సాయంతో పనులు చేస్తున్న దృశ్యం

చెరువులో మొక్కలు నాటిన అక్రమార్కులు

అన్యాక్రాంతమవుతున్న ‘దొర్రిచెరువు’

కూటమి నేతల ఆగడాలకు

అంతేలేని వైనం

ప్రశ్నార్థకంగా వెలిగల్లు

చివరి ఆయకట్టుకు నీరు

చెరువును చెరబట్టారు1
1/1

చెరువును చెరబట్టారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement