 
															మోంథా ఎఫెక్ట్.. హై అలర్ట్
● జిల్లాలోని మదనపల్లెలో
ఉదయం నుంచి కురుస్తున్న వర్షం
● అప్రమత్తమైన అధికార యంత్రాంగం
● మండల కేంద్రాల్లో హెల్ప్‌డెస్క్‌ల ఏర్పాటు
సాక్షి రాయచోటి : అన్నమయ్య జిల్లాపై మోంథాప్రభావం కనిపిస్తోంది. ఇప్పటికే వరుస తుపానులతో తడిసి ముద్దయిన జిల్లాకు మోంఽథాతో ముప్పు పొంచి ఉంది. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా చలి కూడా విపరీతంగా పెరిగింది.ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మోంథా తుపాను ఎలాంటి విపత్కర పరిస్థితులు సృష్టిస్తుందేమోనని అధికార యంత్రాంగం ఆందోళన చెందుతోంది. తుపాను ప్రభావంతో సోమవారం మదనపల్లెలో ఉదయం నుంచి కొద్దిసేపు, తర్వాత మధ్యాహ్నం వర్షం పడగా, మిగతా ప్రాంతాల్లోనూ చినుకులు పడుతూనే ఉన్నాయి. జిల్లాలోని రైల్వేకోడూరు, రాజంపేట, పీలేరు, రాయచోటి, మదనపల్లె, తంబళ్లపల్లె ప్రాంతాల్లో తుంపర వర్షం ప్రారంభమైంది. ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఆకాశం మేఘావృతమై ఉంది. ఇప్పటికే పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. మరోవైపు ప్రకృతి సృష్టించే విపత్తును ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం మదనపల్లె లాంటి చోట్ల మండల కేంద్రాల్లో కూడా హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేసి ప్రత్యేక చర్యలకు ఉపక్రమించారు. అలాగే మున్సిపల్ ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు వచ్చే అవకాశాలు ఉండడంతో స్థానికులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
వెలిగల్లు నుంచి నీటి విడుదల
ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వస్తున్న నేపధ్యంలో ముందుజాగ్రత్తగా ఇరిగేషన్‌శాఖ అధికారులు వైఎస్సార్ వెలిగల్లు ప్రాజెక్టు నుంచి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం వస్తున్న నేపథ్యంలో దిగువనున్న పాపాఘ్ని నదికి 750 క్యూసెక్కులు చొప్పున ఒక గేటు ద్వారా విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు సామర్థ్యం 4.63 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 3.77 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నట్లు అఽధికారుల ద్వారా తెలుస్తోంది. అలాగే సుండుపల్లె మండలంలోని పింఛాతోపాటు శ్రీనివాసపురం రిజర్వాయర్, జిల్లాలోని వివిధ చెరువులకు నీరు వచ్చి చేరుతోంది.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
