 
															పింఛా నదిలో పడిపోయిన యువకుడు
కాపాడిన అధికారులు
పీలేరురూరల్ : ద్విచక్రవాహనంలో పింఛా నదిని దాటే ప్రయత్నం చేసిన ఓ యువకుడు వాహనంతోపాటు నదిలో పడిపోయిన సంఘటన మండలంలోని బాలంవారిపల్లె సమీపంలో నూనేవాండ్లపల్లె వద్ద జరిగింది. పీలేరు మండలం కాకులారంపల్లె పంచాయతీ కోళ్లఫారానికి చెందిన గుండ్లూరు రవికుమార్, నీలావతి కుమారుడు జి. కార్తీక్ (19) డిప్లొమా ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. శనివారం రాత్రి ద్విచక్రవాహనంలో తల్లి నీలావతితో కలసి మండలంలోని బాలంవారిపల్లె పంచాయతీ నాలేవాండ్లపల్లెకు అవ్వగారింటికి వెళ్లారు. ఆదివారం ఉదయం 5 గంటల సమయంలో కార్తీక్ ద్విచక్రవాహనంలో స్వగ్రామానికి బయలుదేరాడు. నూనేవాండ్లపల్లె వద్ద పింఛానదిని దాటే క్రమంలో నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ద్విచక్రవాహనంతో సహా పడిపోయాడు. కొంత దూరం వెళ్లాక నదిలో ఓ చెట్టును పట్టుకుని నది మధ్యలో ఓ రాతి బండపైకి చేరుకున్నాడు. కార్తీక్ వద్ద ఉన్న సెల్‌ఫోన్‌తో తన బంధువులకు సమాచారం అందించాడు. విషయాన్ని రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో తహసీల్దార్ శివకుమార్, సీఐ యుగంధర్, అగ్నిమాపక అధికారి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రోప్‌లైన్ సహాయంతో యువకుడిని అతికష్టంపై కాపాడి గట్టుకు చేర్చారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శివకుమార్, సీఐ యుగంధర్ మాట్లాడుతూ వర్షాలు పడుతున్న నేపథ్యంలో మండలంలో చెరువులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది చలపతి, అశోక్, జాకీర్, షఫీ, రాజేంద్రబాబు, ఇమ్రాన్, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
 
							పింఛా నదిలో పడిపోయిన యువకుడు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
