 
															చదువుకోవాలా.. చదువు చెప్పాలా?
రాజంపేట టౌన్ : 2010వ సంవత్సరం కంటే ముందు ఉపాధ్యాయ పోస్టులు పొందిన వారు టెట్ ఉత్తీర్ణులు కావాలని సుప్రీం కోర్టు తీర్పునివ్వడంతో ఇప్పుడు ఉపాధ్యాయులు విద్యార్థులకు మనసు పెట్టి చదువు చెప్పాలా? లేక చదువుకోవాలో అన్న సందిగ్ధత నెలకొందని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక పాఠశాలలో ఆదివారం నిర్వహించిన పీఆర్టీయూ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. టెన్త్ పబ్లిక్ పరీక్షల టైంటేబుల్ కూడా వచ్చిందని అలాగే టెట్‌కు నోటిఫికేషన్ కూడా విడుదలైందన్నారు. ఇలాంటి తరుణంలో ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులు విద్యార్థులను టెన్త్ పబ్లిక్ పరీక్షలకు ఎలా తర్ఫీదు చేయగలరని, అలాగే టెట్ పరీక్షకు ఎలా ప్రిపేర్ కాగలరని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు ద్వారా కేంద్ర మంత్రులతో మాట్లాడి ఇన్ సర్వీసు ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు ఇచ్చేలా తమవంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఆర్‌టీయూ నాయకులు సూర్యుడు నాయక్, ఉమామహేశ్వర్లు, నరసింహమూర్తి, ఆదాల నరసింహారెడ్డి, రామచంద్రరాజు, రాజారెడ్డి, శ్రీనివాసులు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయ్య

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
