 
															పరిహరం అందేనా.?
గుర్రంకొండ: జిల్లాలో ఈ ఏడాది నష్టాలపాలైన మామిడిరైతులను ఆదుకొని పరిహారం చెల్లించేవారేరని రైతులు ప్రశ్నిస్తున్నారు. గత ఏడాది తొలిసారిగా జిల్లాలో మామిడితోటలకు ఇ–క్రాప్ ద్వారా పంటల బీమా చెల్లించారు. ఈ ఏడాది ఓవైపు మార్కెట్లో గిట్టుబాటు ధరలు లేక, మరోవైపు మామిడి కాయలకు చీడపీడలు ఆవహించి రైతులు భారీగా నష్టపోయారు. గత ఏడాది జిల్లా మొత్తం మీద 4420 మంది రూ.1,24,87,500 పంటల బీమా కోసం ప్రభుత్వానికి చెల్లించారు. కనీసం గతంలో దరఖాస్తు చేసుకున్న వారికై నా పంటలబీమా అందుతుందా అని రైతులు ఎదురు చూస్తున్నారు. దీంతో ఈ ఏడాది ఇ– క్రాప్‌లో మామిడితోటలకు పంటల బీమా చెల్లించేందకు రైతులు ముందుకురాకపోవడం గమనార్హం.
● ఈ ఏడాది సీజన్ ప్రారంభంలో ధరలు కొంతమేరకు ఆశాజనకంగా ఉన్నా ఆతరువాత మామిడి ధరలు పతనమయ్యాయి. బెంగళూరుతో పాటు ఇతర రకాల మామిడికాయల్ని మార్కెట్లో కొనేవారు లేక తోటల్లోనే వదిలేసిన సంఘటనలు జిల్లాలో చోటు చేసుకొన్నాయి. మిగిలిన రకాలకు అప్పట్లో రూ. 15 నంచి రూ,22లోపే ధరలు పలికాయి.కాయలు కోసి మార్కెట్‌కు తరలించినా గిట్టుబాటు కాక పోవడంతో పలువురు కోయకుండా తోటల్లోనే వదిలేశారు. దీంతో మామిడి రైతులు జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది రూ. రూ.65 కోట్ల మేరకు నష్టపోయారు.
చీడపీడలతో పంటనష్టం
మూలిగే నక్కపై తాటికాయపడిందన్న చందనంగా మామిడిరైతుల పరిస్థితి మారింది. ఓవైపు మార్కెట్లో గిట్టుబాటు ధరలు లేక అల్లాడుతుంటే మరోవైపు చీడపీడలతో తోటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా మామిడికాయలు మంచి రంగుమీదకొచ్చి కోతలకు వచ్చిన సమయంలో వైరస్‌లు, ఊజీ, నల్లమచ్చల రోగాలతో పాటు ఇతర చీడపీడలతో తోటలు భారీగా దెబ్బతిన్నాయి. చిన్నపాటి గాలులకు కూడా రాలిపోయి రైతులకు నష్టాలనే మిగిల్చాయి.
తొలిసారిగా ఇ–క్రాప్‌లో
మామిడికి పంటలబీమా
జిల్లాలో తొలిసారిగా గత ఏడాది ప్రభుత్వం కొత్తగా మామిడి పంటకు బీమా సౌకర్యం కల్పించింది. గత ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో ఒక్కో ఎకరానికి రైతు రూ. 2250 పంటల బీమా మొత్తాన్ని చెల్లించేలా కొత్త పథకం ప్రారంభించారు. అకాల వర్షాలకు, వాతావారణ మార్పుల కారణంగా పంటలు దెబ్బతింటే బీమా వర్తిస్తుందని అప్పట్లో అధికారులు ప్రకటించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా 4420 మంది 5550 ఎకరాలకు రూ.1,24,87,500 మొత్తాన్ని పంటల భీమా కింద ప్రీమియం చెల్లించారు.
గత ఏడాది జిల్లాలో తొలిసారిగామామిడికి పంటలబీమా
గడువుదాటినా 4420 మందిరైతులకు అందని పరిహారం
ఈ ఏడాది ఇ–క్రాప్‌పై ఆసక్తి చూపని మామిడిరైతులు
బీమా కంపెనీ వారే చెల్లించాలి
మామిడితోటలకు పంటల బీమా చేసుకొని పంటనష్టపోయిన రైతులకు నష్టపరిహరాన్ని బీమా కంపెనీవారే చెల్లించాలి. రైతు లకు ఎంత మేరకు ఇవ్వాలో వారే నిర్ణయించాల్సి ఉంది. వాతావరణం నెలవారీ వివరాలు బీమాకంపెనీ వారు సేకరించి ఎంతశాతం మేరకు పంటనష్టం జరిగిందన్న సమాచారం వారి వద్దే ఉంది. ఎప్పుడు బీమా సొమ్ము చెల్లిస్తారన్న దానిపై సమాచారం లేదు. – ఈశ్వర్‌ప్రసాద్‌రెడ్డి, ఉద్యానవనశాఖాధికారి, మదనపల్లె
ఎప్పుడిస్తారో
గత ఏడాది ఎకరం మామిడితోటకు పంటల బీమా చేయించాను. ఈ సీజన్‌లో పంట మొత్తం చాలావరకు నష్టపోయాను. మార్కెట్లో గిట్టుబాటు ధరలు లేకపోవడం, వైరస్‌లు, రోగాలు ఎక్కువగా రావడంతో తోటలు దెబ్బతిన్నాయి. అయితే సీజన్ అయిపోయి చాలారోజులవుతున్నా ఇంతవరకు మాకు పంట నష్టపరిహారం అందలేదు. కనీసం పంటల బీమా సొమ్ము ఎప్పుడు అందుతుందో అర్థం కావడంలేదు. – సావిత్రమ్మ, మామిడి రైతు, చారావాండ్లపల్లె
 
							పరిహరం అందేనా.?
 
							పరిహరం అందేనా.?

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
