 
															● భారీ వర్షాల సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు
మోంథా తుపానుతో అన్నదాతల్లో అలజడి
వదంతులు సృష్టిస్తే కఠిన చర్యలు: ఎస్పీ
సాక్షి రాయచోటి: తుపాను అనగానే ప్రజలతోపాటు రైతులు అమ్మో అంటూ భయపడతున్నారు. ఇటీవల వరుసగా తుపానుల నేపథ్యంలో ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోతోంది. బయటికి పోలేక, ఇంటిలో ఉండలేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. మళ్లీ మోంథా తుపానుఅంటే ప్రధానంగా అన్నదాతల్లో అలజడి మొదలైంది. ఇప్పటికే కురిసిన వర్షాలకు రైల్వేకోడూరు, రాజంపేట ప్రాంతాల్లో పండ్ల తోటలతోపాటు పీలేరు, మదనపల్లె తదితర ప్రాంతాల్లో పంట పొలాలు తడి ఆరలేదు. ఉన్న పంటలు ఎక్కడ పోతాయోనన్న ఆందోళన వెంటాడుతుండగా, పండ్ల తోటలకు సంబంధించిన రైతులు కూడా దిగులు చెందుతున్నారు. రోజల తరబడి తడి అలాగే కొనసాగితే తెగుళ్లతోపాటు చెట్లు చనిపోతాయని, నష్టం ఎదుర్కొవాల్సి వస్తోందని భయాందోళనలకు గురవుతున్నారన్నారు. మొన్నటి వర్షాలకు ప్రధాన రహదారులు దెబ్బతిన్నాయి
యంత్రాంగం అలర్ట్
అన్నమయ్య జిల్లాకు సంబంధించి తుపాను ప్రభావం అధికంగా ఉండనుందని వాతావరణశాఖ సూచన నేపథ్యంలో అధికారులు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొవాల్సి వస్తుందోనని యంత్రాంగమంతా అలర్ట్ అయింది. మదనపల్లెలో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపడుతున్నారు. మరోవైపు రైల్వేకోడూరు, రాజంపేటలపై కూడా తుపాను తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. తుపాను నేపథ్యంలో కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. సోమ, మంగళ వారాల్లో పాఠశాలలకు కూడా విద్యాశాఖ సెలవు ప్రకటించింది. జిల్లాలో అన్నదాతల్లో అలజడి కొనసాగుతోంది. ఇప్పటికే పండ్లతోటలతోపాటు ఇతర పంటల్లో తడి ఆరకుండా అల్లాడుతున్న వీరిని గోరుచుట్టుపై రోకలి పోటులా మళ్లీ తుపాను బెంబేలెత్తిస్తోంది. మూడు, నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురిసి సుమారు 10 రోజులు తడి ఆరకపోతే పంట ఉత్పత్తులు చేతికి అందకపోవడం ఖాయం.
మొన్నటి తుపాన్‌తోనే తడి ఆరని పొలాలు
ఇప్పటికే ఎక్కడికక్కడదెబ్బతిన్న ప్రధాన రోడ్లు
తుపాను నేపథ్యంలో అలెర్ట్
ఇప్పటికే పాఠశాలలకు సెలవుప్రకటించిన విద్యాశాఖ
రాయచోటి: మొంథా తుపాన్‌పై వదంతులు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి హెచ్చరించారు. వాతావరణ శాఖ సమాచారం ప్రకారం ఈ నెల 27, 28 తేదీల్లో జిల్లాపై ‘మొంథా తీవ్ర ప్రభావం చూపనుందని ఎస్పీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎట్టిపరిస్థితుల్లోనూ వర్షంలో బయటకు వెళ్లొద్దన్నారు. అనవసర ప్రయాణాలు మానుకోవాలని తెలిపారు.తల్లిదండ్రులు తమ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. వారు నీటిలోకి, ప్రమాదకర ప్రదేశాల వద్దకు వెళ్లకుండా పర్యవేక్షించాలని సూచించారు.వాగులు, వంకలు, నదులు, చెరువులు నిండుకుండల్లా ప్రమాదకర స్థాయిలో ఉన్నాయి. సరదా కోసమైనా, స్నానం కోసమైనా నీటిలో దిగవద్దు, దింపవద్దని తెలిపారు.
మోంథా తుపాన్ వల్ల ఈ నెల 27, 28, 29 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
అత్యవసరమైతే తప్పా బయటకు వెళ్లకండి.
నీటితో నిండిన రహదారులు, వంతెనలు దాటేందుకు ప్రయత్నించవద్దు.
విద్యుత్ తీగలు, పోల్‌లు తాకరాదు, వాటికి దగ్గరగా కూడా వెళ్లవద్దు.
ఇళ్ల చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజ్ సదుపాయాలను శుభ్రం చేసుకోండి.
చిన్న పిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లకుండా జాగ్రత్తపడండి.
నదులు, వాగులు పొంగిపొర్లే అవకాశం ఉన్నందున తీర ప్రాంతాల వద్దకు వెళ్లకండి.
వరద నీరు ఇళ్లలోకి చేరే అవకాశం ఉంటే, ముందుగానే సురక్షిత ప్రదేశాలకు తరలించండి.
పశువులను ఎత్తైన ప్రదేశాలకు తరలించండి.
పిడుగు సమయంలో చెట్ల కింద లేదా ఓపెన్ ప్రదేశాల్లో నిలబడి ఉండవద్దు.
మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్, టీవీ వంటి ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగాన్ని ఆపండి.
పిడుగు సమయంలో నీటిలో ఉండవద్దు చేపలు పట్టడం లేదా స్నానం చేయడం మానుకోండి.
ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి పోలీసు, రెవెన్యూ, అగ్నిమాపక శాఖ అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
 
							● భారీ వర్షాల సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
