 
															దెబ్బతిన్న వరిపంట పరిశీలన
పెనగలూరు: మండలంలో ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న వరిపంటను జిల్లా వ్యవసాయశాఖ అధికారి శివనారాయణ ఆదివారం పరిశీలించారు. ఆయన నారాయణనెల్లూరు, కోమంతరాజుపురం గ్రామాల్లో పర్యటించారు. మండల వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఎక్కడెక్కడ వరిపంట దెబ్బతిందో పరిశీలించి నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామని తెలిపారు. పడిపోయిన వరి పంటను మొలకెత్తకుండా వరి ఎన్నులు నిలబెట్టి చుట్టినట్‌లైతే కొంతమేర నష్టం లేకుండా కాపాడుకోవచ్చని ఆయన తెలిపారు. కార్యక్రమంలో రైల్వేకోడూరు సహాయ వ్యవసాయ సంచాలకులు శివశంకర్, మండల వ్యవసాయశాఖ అధికారి సచివాలయ వ్యవసాయశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నందలూరు మండలంలో..
నందలూరు: మండలంలో వర్షంతో దెబ్బతిన్న వరి పంటలను ఆదివారం జిల్లా వ్యవసాయ అధికారి శివనారాయణ, రాజంపేట సహాయ వ్యవసాయ సంచాలకులు జి.శివశంకర్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయాధికారి మాట్లాడుతూ పంట కోసిన రైతులు వరికుప్పల మీద ఐదు శాతం ఉప్పు ద్రావణం పిచికారీ చేయాలన్నారు. కోతకు సిద్ధంగా ఉన్న పంటను వారం రోజుల తర్వాత కోయాలని చెప్పారు. వర్షాలు ఆగిన తర్వాత పంట మీద హెక్సాకానిజోల్ అనే మందులు పిచికారీ చేసి వ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి జి.మల్లిఖార్జున, వ్యవసాయ శాఖ సిబ్బంది శిల్ప, భరత్‌కుమార్ పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
