 
															పోలీసు సేవలపై అవగాహన అవసరం
ఓపెన్ హౌస్‌తో విద్యార్థులకు
స్ఫూర్తి నింపిన ఎస్పీ ధీరజ్ కునుబిల్లి
రాయచోటి : అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతికత, ప్రజల సంరక్షణ, శాంతికోసం చేస్తున్న పోలీసు సేవలపై పూర్తి స్థాయిలో అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి విద్యార్థులకు బోధించారు. ఆదివారం రాయచోటిలోని పోలీసు కార్యాలయం వేదికగా పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓపెన్ హౌస్ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ప్రారంభించి పరిశీలనకు వచ్చిన విద్యార్థులకు పోలీసుల సాంకేతికత, సేవలను వివరిస్తూ ఉపాధ్యాయుడి పాత్రను పోషించారు. నేటి సమాజంలో పోలీసుల పాత్రను విద్యార్థులకు అర్థమయ్యేలా వివరించి ఆకట్టుకున్నారు. విద్యార్థులకు ఏకే 47 తుపాకీ, డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్, రోబో డ్రెస్‌ల గురించి అవగాహన కల్పించారు. విధి నిర్వహణలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరుల సంస్మరణార్థమే ఈ ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. అమరవీరుల త్యాగాలు మనందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. విద్యార్థి దశ నుంచే పోలీసులు వినియోగించే ఆధునిక ఆయుధాలు, టెక్నాలజీ గురించి తెలుసుకోవడం చాలా అవసరమన్నారు. యువత చదువుతోపాటు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. మంచి ఆలోచనలతో భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలన్నారు. ముఖ్యంగా చెడు అలవాట్లకు, మాదక ద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలన్నారు. కేసుల ఛేదనలో పోలీసులు ఉపయోగించే సాంకేతికతను, సైబర్ నేరాలపట్ల అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకతను వివరించారు. శక్తి యాప్‌ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం ఏఆర్ సిబ్బంది, పోలీసు బృందాలు 303 తుపాకీ, 7.62 ఎంఎం సెల్ఫ్ లోడింగ్ రైఫిల్, 9 ఎంఎం పిస్టల్, ఏకే 47, టియర్ గ్యాస్ గన్‌తోపాటు ఇతర పరికరాలు, రైట్ గేర్ ఎక్యూప్‌మెంట్, బీపీ జాకెట్‌లను ప్రదర్శించి వాటి పనితీరును వివరించారు. అలాగే సాంకేతికత, పరిశోధన, బాంబ్ స్క్వాడ్, ట్రాఫిక్ వ్యవస్థ, శక్తి టీమ్, సైబర్ క్రైమ్, పోలీసు హోదాలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి, రాయచోటి డీఎస్పీ ఎంఆర్ కృష్ణమోహన్, ఏఆర్ డీఎస్పీ ఎం.శ్రీనివాసులు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
