బస్సు కింద పడి మహిళకు తీవ్ర గాయాలు | - | Sakshi
Sakshi News home page

బస్సు కింద పడి మహిళకు తీవ్ర గాయాలు

Oct 26 2025 8:07 AM | Updated on Oct 26 2025 8:07 AM

బస్సు

బస్సు కింద పడి మహిళకు తీవ్ర గాయాలు

బి.కొత్తకోట : బస్సు దిగి అదుపు తప్పిన మహిళ కాలుపై బస్సు వెళ్లడంతో తీవ్రంగా గాయపడిన ఘటన శనివారం మండలంలో జరిగింది. శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలం చీకటిమానుపల్లెకు చెందిన సుజాత (35) బంధువుల ఇంటికి వచ్చింది. తిరిగి స్వగ్రామానికి వెళ్లేందుకు బి.కొత్తకోటకు వెళ్లే బస్సు ఎక్కింది. అమర నారాయణపురం వద్ద బస్సు దిగుతూ సుజాత అదుపుతప్పి పడిపోయింది. ముందుకు కదిలిన బస్సు సుజాత ఎడమ కాలిపై వెళ్లడంతో తీవ్రంగా గాయమైంది. స్థానికుల సమాచారంతో 108లో చికిత్స కోసం మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

బాధితురాలికి బంగారు గొలుసు అప్పగింత

మదనపల్లె రూరల్‌ : పట్టణంలోని ఎగ్జిబిషన్‌లో ఓ మహిళ పోగొట్టుకున్న బంగారు గొలుసును టూటౌన్‌ సీఐ రాజారెడ్డి బాధితురాలికి అప్పగించారు. కురబలకోట మండలం తెట్టు గ్రామానికి చెందిన శ్రీనివాసులు భార్య తరిగొండ ప్రమీల(37) పట్టణంలోని టిప్పుసుల్తాన్‌ మైదానంలో జరుగుతున్న ఎగ్జిబిషన్‌కు వచ్చింది. సుమారు 10 గ్రాముల బంగారు గొలుసు పోగొట్టుకుంది. దీంతో బాధితురాలు టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని సీఐ రాజారెడ్డికి ఫిర్యాదు చేసింది. తక్షణమే స్పందించిన ఆయన సాంకేతికత ఆధారంగా మహిళ పోగొట్టుకున్న బంగారు గొలుసును గుర్తించారు. టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు బాధితురాలిని పిలిపించి, బంగారు గొలుసు అందజేశారు. ఈ సందర్భంగా సీఐ రాజారెడ్డి, పోలీస్‌ సిబ్బందికి తరిగొండ ప్రమీల కృతజ్ఞతలు తెలిపింది. కార్యక్రమంలో ఏఎస్‌ఐ రమణ పాల్గొన్నారు.

గాలేరు– నగరిని సత్వరమే పూర్తి చేయాలి

రాజంపేట : ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గాలేరు–నగరి ప్రాజెక్టుకు నిధులు కేటాయించి సత్వరమే పూర్తి చేయాలని సాగునీటి ప్రాజెక్టుల అధ్యయన బృందం డిమాండ్‌ చేసింది. శనివారం బృందం సభ్యులు అన్నమయ్య ప్రాజెక్టును పరిశీలించారు. ఈ బృందంలో రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, రైతు సేవాసంస్ధ అధ్యక్షుడు అక్కినేని భవానీ ప్రసాద్‌, జలవనరుల, సాగునీటి ప్రాజెక్టుల విశ్లేషకులు టి.లక్ష్మీనారాయణ, సెంటర్‌ ఫర్‌ లిబిర్టీ అధ్యక్షుడు నలమోతు చక్రవర్తి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాలేరు–నగిరి సుజల స్రవంతికి నిధులు కేటాయించకపోవడం దుర్మార్గమన్నారు. అలాగే అన్నమయ్య ప్రాజెక్టును సత్వరమే పూర్తిచేయాలన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే 22 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మహేష్‌, రిటైర్డ్‌ డీఆర్‌ఓ ఈశ్వరయ్య, సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు రవికుమార్‌, సీపీఐ పట్టణ కార్యదర్శి సికిందర్‌, హెల్పింగ్‌ హ్యాండ్‌ అసోసియేషన్‌ ప్రతినిధి రమణ, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు గాలి చంద్ర తదితరులు పాల్గొన్నారు.

చోరీ కేసులో నిందితుల అరెస్టు

తొండూరు : మండలంలోని మల్లేల ఇమాంబీ దర్గాలో దొంగతనం చేసిన కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు పులివెందుల రూరల్‌ సీఐ వెంకటరమణ తెలిపారు. శనివారం తొండూరు పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐ ఘన మద్దిలేటితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. నంద్యాల జిల్లా దొర్నిపాడు మండలం గోవిందిన్నె బీసీ కాలనీకి చెందిన షేక్‌ హిదయతుల్లా, జమ్మలమడుగు పట్టణానికి చెందిన షేక్‌ గైబుసావలీ ఈనెల 21వ తేదీన మల్లేల ఇమాంబీ దర్గాలోని హుండీని పగులగొట్టి రూ.30వేల నగదును అపహరించారన్నారు. వారిని శనివారం తొండూరు పోలీస్‌ స్టేషన్‌ సమీపంలోని భద్రంపల్లె క్రాస్‌ రోడ్డు వద్ద అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.30వేల నగదుతోపాటు హీరో హోండా ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. హిదయతుల్లాపై ఇప్పటికే ప్రకాశం జిల్లా అర్థవీడు, పులివెందుల, మైలవరం పోలీస్‌ స్టేషన్లలో పలు దొంగతనాల కేసులు నమోదై ఉన్నాయన్నారు. అలాగే గైబుసావలీ కూడా పులివెందుల, మైలవరం పోలీస్‌ స్టేషన్లలో దొంగతనం కేసులలో నిందితుడుగా ఉన్నట్లు వివరించారు. వీరిని పులివెందుల కోర్టుకు హాజరుపరిచినట్లు ఆయన తెలిపారు.

వర్షానికి కూలిన మట్టి మిద్దె

వేంపల్లె : వేంపల్లె పట్టణం 12వ వార్డు జెండామాను వీధిలో ఉన్న మాబు ఖాతున్‌కు చెందిన మట్టి మిద్దె గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కూలింది. ప్రమాదం తప్పడంతో బాధితులు ఊపిరి పీల్చుకున్నారు. బాధితురాలు మాట్లాడుతూ శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో మిద్దె కూలిందన్నారు. వస్తువులు ధ్వంసం కావడంతో దాదాపు రూ.50 వేలు నష్టం జరిగిందన్నారు. ప్రభుత్వం ఇంటిని మంజూరు చేసి నష్ట పరిహారం ఇవ్వాలని కోరారు.

బస్సు కింద పడి మహిళకు తీవ్ర గాయాలు1
1/3

బస్సు కింద పడి మహిళకు తీవ్ర గాయాలు

బస్సు కింద పడి మహిళకు తీవ్ర గాయాలు2
2/3

బస్సు కింద పడి మహిళకు తీవ్ర గాయాలు

బస్సు కింద పడి మహిళకు తీవ్ర గాయాలు3
3/3

బస్సు కింద పడి మహిళకు తీవ్ర గాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement