రక్షక భటులు.. రక్తదాతలైన వేళ! | - | Sakshi
Sakshi News home page

రక్షక భటులు.. రక్తదాతలైన వేళ!

Oct 26 2025 8:07 AM | Updated on Oct 26 2025 8:07 AM

రక్షక భటులు.. రక్తదాతలైన వేళ!

రక్షక భటులు.. రక్తదాతలైన వేళ!

మెగా వైద్య శిబిరంలో రక్తదానం

చేసిన పోలీసులు

పోలీసు కుటుంబాలకు వైద్య పరీక్షలు

శిబిరాన్ని ప్రారంభించిన

జిల్లా ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లి

రాయచోటి : జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం ఆవరణం శనివారం ఒక పండుగ వాతావరణాన్ని తలపించింది. పోలీసులు మానవతా మూర్తులయ్యారు. సమాజ రక్షణలో అసువులు బాసిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ఈనెల 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జరుగుతున్న సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా అన్నమయ్య జిల్లా పోలీసులు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించి రక్తదానం చేయండి.. ప్రాణదాతలు కండి అంటూ ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లి ఇచ్చిన పిలుపునకు అపూర్వ స్పందన లభించింది. ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు, ప్రసవాలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో రక్తం లేక ఎంతో మంది ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్నారన్నారు. వారి అవసరాలు తీర్చడానికే ఈ సంకల్పం అన్నారు. ఎస్పీ పిలుపుతో స్ఫూర్తి పొందిన పోలీసులు 100 మందికి పైగా స్వచ్ఛందంగా రక్తదానానికి ముందుకు వచ్చారు. జిల్లా ఎస్పీతోపాటు రాజంపేట ఏఎస్పీ మనోజ్‌ రామనాథ్‌ హెగ్డే, మదనపల్లి డీఎస్పీ ఎస్‌. మహేంద్ర, ఏఆర్‌ డీఎస్పీ ఎం,శ్రీనివాసులు సహా పలువురు పోలీసు అధికారులు రక్తదానం చేసి సిబ్బందికి ఆదర్శంగా నిలిచారు. రక్తదానం చేసిన ప్రతి పోలీసునూ ఎస్పీ అభినందించి పండ్లు, జ్యూస్‌ బాటిళ్లను అందజేశారు. పోలీసు సిబ్బంది, వారి కుటుంబాలు ఆరోగ్యంగా ఉంటేనే శాంతి భద్రతలను మరింత సమర్థంగా కాపాడగలుగుతారని ఎస్పీ అభిప్రాయపడ్డారు. శిబిరంలో సాధారణ బీపీ, షుగర్‌ పరీక్షలతోపాటు అత్యంత ముఖ్యమైన డర్మటాలజిస్ట్‌, డెంటల్‌, గైనకాలజిస్టు, జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జన్‌, ఫిజిషియన్‌, ఆప్తమాలజిస్టు వంటి నిపుణులతో వైద్య పరీక్షలు చేయించారు. పోలీసు సిబ్బంది కుటుంబ సభ్యులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. జిల్లా ఆసుపత్రులసమన్వయ అధికారి డాక్టర్‌ ఆంజనేయులు ఆధ్వర్యంలో వైద్య సేవలు అందించిన రాయచోటి ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ లక్ష్మీ ప్రసాద్‌, సీఎస్‌ఆర్‌ఎంఓ డాక్టర్‌ కిరణ్‌ కుమార్‌, ప్రభుత్వ వైద్యులు నవీన్‌ కుమార్‌, శైలేష్‌, మహేశ్వరరాజు, రామరాజు, మస్తాన్‌ రావు, ప్రశాంతి, వైద్య సిబ్బందికి ఎస్పీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి, ఇతర సీఐలు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది, హోంగార్డు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement