 
															యథేచ్ఛగా ఆక్రమణలు.. నిత్యం ప్రమాదాలు!
● ఎన్‌హెచ్ 340 స్థలాలు కబ్జా
● డ్రైనేజీల ఆక్రమణ.. ఆపై అద్దె వసూళ్లు
● దుకాణాలపై దూసుకెళుతున్న వాహనాలు
గుర్రంకొండ : మండలంలోని గుర్రంకొండ, ఖండ్రిగ గ్రామాల్లో జాతీయ రహదారి 340కు సంబంధించి రోడ్డుకిరువైపులా ఉన్న స్థలాలు కబ్జాకు గురయ్యాయి. దీంతో రోడ్డు ఇరుకుగా మారడంతో వాహనాలు దుకాణాలపై దుసుకెళుతున్నాయి. నిత్యం బస్టాండులో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. జాతీయ రహదారి 340కి ఇరువైపులా ఉన్న పంచాయతీ, స్మశాన స్థలాలను కబ్జా చేశారు. చివరకు డ్రైనేజి కాలువలను కూడా ఆక్రమించుకొని వాటిపై అద్దెలు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ స్థలాల్లో దుకాణాలు నిర్వహించుకొనే విషయమై ప్రతిరోజు బస్టాండులో ఘర్షణలు జరుగుతున్నాయి.
అనధికారికంగా 100 దుకాణాలు..
వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందిన గుర్రంకొండ బస్టాండు, ఖండ్రిగ గ్రామాల్లో ఎన్‌హెచ్ 340కు సంబంధించి కబ్జాకు గురైన స్థలాల్లో సుమారు 100 దుకాణాలను అనధికారికంగా నిర్వహించుకుంటున్నారు. వీటిపై ఆక్రమణదారులు రూ. 3వేలు నుంచి రూ. 6వేలు వరకు అద్దెలు వసూలు చేస్తున్నారు.
దుకాణాలపై దూసుకెళుతున్న వాహనాలు..
స్థానిక కోన క్రాస్ నుంచి బస్టాండు మీదుగా గుర్రంకొండ మార్కెట్‌యార్డు వరకు రోడ్డు కిరువైపులా ఉన్న ఎన్‌హెచ్ 340 స్థలాల్లో అక్రమంగా దుకాణాలు నిర్వహించుకొంటున్నారు. దీంతో బస్టాండుతో పాటు పలుచోట్ల ఇష్టానుసారంగా దుకాణాలు వెలిశాయి. కనీసం ద్విచక్రవాహనాలు నిలుపుకొనేందుకు కూడా వీలులేకుండా స్థలాలు ఆక్రమణలకు గురయ్యాయి. దీంతో వాహనాలు, లారీలు, ద్విచక్రవాహనాలు అదుపుతప్పి దుకాణాల్లోకి దూసుకెళుతున్నాయి. కారణంగా బస్టాండులో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ హోటల్లోకి వాహనాలు దూసుకెళ్లడంతో పలువురికి ప్రాణాపాయం తప్పింది.
డ్రైనేజీ కాలువపై అద్దెలు వసూళ్లు..
ఆక్రమణలకు కాదేదీ అనర్హం అంటూ పలువురు ఆక్రమణదారులు బస్టాండులోని డ్రైనేజీ కాలువలను కూడా ఆక్రమించేశారు. ఎన్‌హెచ్ 340 రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా బస్టాండులో ఇటీవల విశాలమైన డ్రైనేజీలు నిర్మించారు. వీటిని కూడా అక్రమార్కులు వదల్లేదు. వీటిని ఆక్రమించుకొని చిల్లర దుకాణాలు, తోపుడుబండ్లు నిర్వహించుకొనేందుకు అద్దెలకు ఇచ్చారు. చివరకు కాలువలపై రేకుల షెడ్లు కూడా వేసి రూ. 3వేల వరకు అద్దెలు వసూలు చేస్తున్నారు.
 
							యథేచ్ఛగా ఆక్రమణలు.. నిత్యం ప్రమాదాలు!

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
