 
															టమాటా పొలాల్లో నీటిని తీసివేయాలి
మదనపల్లె రూరల్ : అధిక వర్షాలతో టమాటా పొలాల్లో నిలిచిన వర్షపునీటిని నిల్వ లేకుండా ఎప్పటికప్పుడు కాలువల ద్వారా తీసివేయాలని జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్ ఎస్‌ఎస్‌వి సుభాషిణి అన్నారు. బుధవారం మండలంలోని కొత్తవారిపల్లె, సీటీఎం గ్రామాల్లో టమాటా పంటలను పరిశీలించారు. వర్షాకాలంలో టమాటా పంట సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు తెలియజేశారు. వర్షాల వల్ల దెబ్బతిన్న టమాటా పంటకు తగిన చర్యలు తీసుకునేందుకు పొలంలో నిలిచిన నీటిని తీసివేయడంతో పాటు మొక్కలకు మట్టిని ఎగదోయాలన్నారు. వర్షాలు ఆగిన వెంటనే 19–19–19 లేదా 13–0–45 లీటర్ నీటికి 5 గ్రాముల సూక్ష్మపోషకాలు 5 గ్రాముల చొప్పున లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలన్నారు. పొలాలు ఆరిన వెంటనే నీటిలో కరిగే ఎరువులను ఎకరాకు 5 కిలోలు డ్రిప్ ద్వారా పంపితే, కొత్త చిగురులు వచ్చి కొత్త పూత, పిందె వచ్చే ఆస్కారం ఉందని తెలిపారు. అలాగే ఆకులు, కాయలపై వచ్చే మచ్చల నివారణకు అక్రోబాట్ కంప్లీట్ 1.5గ్రాము.లేదా అమిస్టర్ టాప్ 1 గ్రా, స్ట్రెప్టోమైసిన్ 0.5 గ్రా లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలన్నారు. కలుపు మొక్కలు లేకుండా పొలాన్ని శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో మండల హార్టికల్చర్ ఆఫీసర్ ఈశ్వరప్రసాదరెడ్డి, సీటీఎం, కొత్తవారిపల్లె హార్టికల్చర్ అసిస్టెంట్లు, రైతులు పాల్గొన్నారు.
జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్ సుభాషిణి

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
