 
															ముగ్గురి మృతికి కారకుడైన లారీ డ్రైవర్‌కు జైలుశిక్ష
మదనపల్లె రూరల్ : నిర్లక్ష్యంగా లారీని నడిపి ముగ్గురు యువకుల మృతికి కారకుడైన లారీ డ్రైవర్‌కు 15నెలల జైలుశిక్ష విధిస్తూ మదనపల్లె ప్రిన్సిపల్ జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ సుభాన్ బుధవారం తీర్పు ఇచ్చారు. డీఎస్పీ మహేంద్ర తెలిపిన వివరాలిలా...2021 ఫిబ్రవరి 12 రాత్రి 7.30 గంటల సమయంలో మదనపల్లె–తిరుపతి మార్గంలోని శానిటోరియం ఆస్పత్రి వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. పట్టణానికి చెందిన శ్రీహరి, తరుణ్‌కుమార్‌రెడ్డి, ధనుష్‌లు ద్విచక్రవాహనంలో వెళుతుండగా, శానిటోరియం వద్ద ఎదురుగా అతివేగంగా అజాగ్రత్తగా వచ్చిన లారీ యువకులను ఢీకొంది. ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. ఘటనపై శ్రీహరి తండ్రి మండపల్లి శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు,..తాలూకా పోలీసులు క్రైమ్‌నెంబర్.45/2021, సెక్షన్.304(ఏ) ఐపీసీ కింద కేసు నమోదు చేశారు. అప్పటి సీఐ శ్రీనివాసులు కేసు దర్యాప్తు చేసి ప్రమాదానికి కారకుడైన రాయచోటి కొత్తపేటకు చెందిన లారీ డ్రైవర్ ఎస్.మహబూబ్‌బాషాను అరెస్ట్‌చేసి చార్జ్‌షీట్ దాఖలు చేశారు. కేసు విచారణలో ప్రాసిక్యూషన్ తరపున సీనియర్ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సి.కృష్ణారెడ్డి వాదనలు వినిపించగా, సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి బి.సుభాన్..నిందితుడు మహబూబ్‌బాషాకు 15నెలల సాధారణ జైలుశిక్ష, రూ.1,500 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. కేసు విచారణ వేగవంతంకు కృషిచేసిన మదనపల్లె డీఎస్పీ మహేంద్ర, తాలూకా సీఐ కళావెంకటరమణ, ఎస్‌ఐలు జి.చంద్రమోహన్, గాయత్రి, కోర్టు సిబ్బంది జే.శివకుమార్, వినోద్‌కుమార్‌లను జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి అభినందించారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
