 
															పంచాయతీ కార్మికులకు అందని వేతనాలు
● రూ.90 లక్షలు నిధులు గోల్‌మాల్
జరిగినట్లు ఆరోపణలు
● ఆరు నెలలుగా జీతాలు లేక పంచాయతీ సిబ్బంది అవస్థలు
రైల్వేకోడూరు : గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు ఆరు నెలలుగా వేతనాలు విడుదల కాకపోవడంతో అప్పులు చేసి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. గ్రామాల్లో వీధులు శుభ్రపరచడం, మురుగు కాలువలు తీయడం, వీధి దీపాలు ఏర్పాటు చేయడం, నర్సరీలో మొక్కలు పెంచడం, చెత్తను సేకరించి డంపింగ్ యార్డులో వేయడం లాంటి పనులను కార్మికులు నిర్వహిస్తున్నా వారికి మాత్రం పూట గడవడం కష్టంగా మారుతోంది. నెల నెల జీతాలు అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేతనాలు అందించాలని ఉన్నతాధికారులను కోరినా పట్టించుకోలేదని వాపోతున్నారు. పంచాయతీలో రూ. 90 లక్షలు నిధులు గోల్‌మాల్ అయినట్లు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా కూటమి నాయకుల వర్గపోరుతో ఒక వర్గం వారు ఫిర్యాదు చేస్తే మరోవర్గం వారు నిలుపుదల చేశారు. అధికార పార్టీ నాయకుల అండదండలతో లక్షల రూపాయలు చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. సమగ్ర విచారణ కొనసాగించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. పంచాయతీ కార్యదర్శులు విధులు నిర్వహించే సమయంలో నిధులు దుర్వినియోగమయ్యాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
