
మా పార్టీ వారే నాపై దాడి చేశారు
రాయచోటి : తెలుగుదేశం పార్టీకి చెందిన మా వాళ్లే తన పైన దాడి చేసి తీవ్రంగా గాయపరచారంటూ టీడీపీ బీసీ నేత రెడ్డి వరప్రసాద్ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. రాయచోటి పట్టణం, కొత్తపేటలోని వినాయక వీధి సమీపంలోని సంజీవిని మెడికల్ స్టోర్‌లో ఉన్న రెడ్డి వరప్రసాద్ తనపై కొంతమంది తెలుగుదేశం పార్టీవారు ఆదివారం సాయంత్రం దాడికి తెగబడినట్లు మీడియా ముందు తెలిపారు. మెడికల్ స్టోర్‌లో ఉన్న తనను చితకబాది అక్కడున్న వీడియో పుటేజ్‌లను రికార్డింగ్ హార్డ్ డిస్క్‌ను తీసుకెళ్లిపోయారన్నారు. తాను 30 సంవత్సరాలుగా టీడీపీ కోసం పనిచేస్తున్నానని, స్థానికంగా ఉన్న నాయకులు టీడీపీ అధికారంలోకి వచ్చాక పక్క పార్టీ వారి దగ్గర డబ్బులు తీసుకొని పనులు కేటాయించడంపై తాను ప్రశ్నించానన్నారు. తాను ఒక బీసీ కులానికి చెందిన వ్యక్తినని, ఎస్సీ మహిళను వివాహం చేసుకొని మెడికల్ స్టోర్ నడుపుకుంటూ పార్టీ కోసం పనిచేస్తున్నానన్నారు. తమ పార్టీకి చెందిన కొంతమంది పనిగట్టుకొని తనపై సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టడం, బెదిరించడం చేశారన్నారు. తీవ్రంగా గాయపరిచిన వారిపై పోలీసులు కేసు నమోదు చేసి తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. తీవ్రంగా గాయపడిన రెడ్డి వరప్రసాద్‌కు రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
టీడీపీ బీసీ నేత రెడ్డి వరప్రసాద్